ఉద్యోగులకు తీపికబురు..పెండింగ్ బిల్లుల విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik
ఉద్యోగులకు తీపికబురు..పెండింగ్ బిల్లుల విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పెండింగ్ బిల్లులు రూ.700 కోట్లను ఆర్థికశాఖ అన్ని శాఖల ఉద్యోగుల శాలరీ అకౌంట్లలో జమ చేసింది. వీటిలో గత 20 నెలలుగా పెండింగులో ఉన్న సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఒకేసారి రూ.392 కోట్లు విడుదలయ్యాయి. ప్రతినెలా జీతభత్యాలకు ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి బిల్లులను ఖజానా శాఖకు దాఖలు చేయడం ఆనవాయితీ. వీటిని దాఖలు చేసే సమయంలో ఎవరైనా ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన వివరాలు పెండింగులో ఉంటే సప్లిమెంటరీ పద్దు కింద మళ్లీ బిల్లును అదే కార్యాలయం దాఖలు చేస్తుంది. ఇలా గత రెండేళ్లలో దాఖలు చేసిన సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఇంకా రూ.1,900 కోట్లను ఆర్థికశాఖ విడుదల చేయాల్సి ఉంది.
వీటితోపాటు ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులకు నెలనెలా రూ.700 కోట్ల చొప్పున దశలవారీగా ఇస్తామని జూన్‌లో కేబినెట్ అనౌన్స్ చేసింది. కాగా, ఈ నెలకు సంబంధించిన రూ.700 కోట్లను శనివారం ఉద్యోగుల ఖాతాల్లో వేసినట్లు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. సప్లిమెంటరీ వేతన బిల్లులతోపాటు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బిల్లులకు మరో రూ.308 కోట్లను చెల్లించినట్లు తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.