ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర..ఎప్పటి నుంచి అంటే?
మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి.
By Knakam Karthik
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర..ఎప్పటి నుంచి అంటే?
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగనుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని పూజారుల సంఘం తెలిపింది. 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది.
కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో మేడారం జాతరను రాష్ట్ర పండుగా గుర్తించింది. ఈ మహా జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలు, అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడి వచ్చే భక్తుల సంఖ్య కోట్లలోనే ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవార్లకు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని సమర్పించుకుంటారు. ఈ మేరకు అధికార యంత్రాంగం కూడా భారీ ఏర్పాట్లు చేస్తుంది.