తెలంగాణ మహిళలకు శుభవార్త.. త్వరలో స్మార్ట్ కార్డులు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు...
By - అంజి |
తెలంగాణ మహిళలకు శుభవార్త.. త్వరలో స్మార్ట్ కార్డులు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) కీలక అడుగు వేసింది. త్వరలోనే మహిళా ప్రయాణికులందరికీ స్మార్ట్ కార్డులను జారీ చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రస్తుతం ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను చూపిస్తూ జీరో టికెట్లను పొందుతున్నారు.
అయితే, ఈ ప్రక్రియలో కండక్టర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడానికి, ప్రయాణికుల డేటాను ఖచ్చితంగా నమోదు చేయడానికి ఆర్టీసీ 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల'ను ప్రవేశపెడుతోంది. ఈ కార్డులు అత్యాధునిక 'చిప్' సాంకేతికతతో రూపొందించబడ్డాయి. బస్సులో కండక్టర్ వద్ద ఉండే కొత్త రకం ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ల (iTIMs) పై ఈ కార్డును ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా జీరో టికెట్ జనరేట్ అవుతుంది. దీనివల్ల ఏ మార్గంలో ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు, ఏయే వయస్సు వారు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు వంటి వివరాలు ప్రభుత్వం వద్ద నిక్షిప్తమవుతాయి.
దీని ఆధారంగా బస్సుల సంఖ్యను పెంచే అవకాశం ఉంటుంది. ఈ కార్డుల పంపిణీని ప్రభుత్వం దశలవారీగా చేపట్టాలని నిర్ణయించింది. తొలుత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా కార్డులను పంపిణీ చేస్తారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చే సాంకేతిక సాధకబాధకాలను పరిశీలించిన తర్వాత, వచ్చే నెల (మార్చి) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలందరికీ ఈ కార్డులను జారీ చేయనున్నారు. ఈ కార్డుల కోసం మహిళలు ఆన్‌లైన్ లేదా నిర్దేశించిన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు వివరాలు, ఫోటో అవసరమవుతాయని సమాచారం. కార్డులు పొందే వరకు పాత పద్ధతిలోనే గుర్తింపు కార్డులు చూపి ప్రయాణించవచ్చు.