రాఖీ రోజు ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన మహిళా కండక్టర్

బస్సు కండక్టరే అండగా నిలబడి సాయం చేసింది. గర్భిణీకి పురుడు పోసి తల్లీ, బిడ్డలను కాపాడింది.

By Srikanth Gundamalla  Published on  19 Aug 2024 5:26 AM GMT
TGSRTC, conductor, delivery,  baby girl,  bus ,

రాఖీ రోజు ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన మహిళా కండక్టర్

రాఖీ పండుగ సందర్భంగా మహిళలు చాలా మంది తమ అమ్మగారి ఇంటికి పయనం అవుతున్నారు. అన్నాదమ్ములకు రాఖీలు కడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ నిండు గర్భిణీ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో.. ఆ బస్సు కండక్టరే అండగా నిలబడి సాయం చేసింది. గర్భిణీకి పురుడు పోసి తల్లీ, బిడ్డలను కాపాడింది. తనకు సంబంధం లేని పని వెనకడుకు వేయకుండా రెండు ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన రాఖీ పర్వదినాన చోటు చేసుకోవడం విశేషం. సదురు కండక్టర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.

ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. బస్సుల్లో జన్మించిన చిన్నారిని చేతిలో ఎత్తుకున్న కండక్టర్‌ ఫోటోను పోస్టు చేశారు సజ్జనార్. గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడ‌బిడ్డ‌కు మ‌హిళ జ‌న్మ‌నిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని తెలిసింది.

రక్షాబంధన్ రోజున గర్భిణికి పురుడు పోసిన కండక్టర్‌ భారతిని టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు. నర్సు సాయంతో సకాలంలో స్పందించి పురుడు పోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటడం గొప్ప విషయమని సజ్జనార్‌ రాసుకొచ్చారు.

Next Story