తెలంగాణ-ఏపీ మధ్య 560 బస్సులను రద్దు చేసిన TGSRTC
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల వరదలు పోటెత్తాయి.
By Srikanth Gundamalla Published on 2 Sep 2024 8:00 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల వరదలు పోటెత్తాయి. చాలా చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వంతెనలు వద్ద రోడ్డు కోతకు గురైంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుండపోత వర్షాలు, వరదల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ-తెలంగాణ మధ్య రవాణాకు కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చాలా చోట్ల వరద ప్రవహిస్తోంది. ఈ మార్గంలో వెళ్లే దాదాపు అన్ని బస్సులను తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఏపీ-తెలంగాణ మధ్య 560కి పైగా బస్సులను రద్దు చేస్తూ టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ జిల్లాలో 150, రంగారెడ్డి జిల్లాలో 70కి పైగా బస్సులను టీజీఎస్ఆర్టీసీ రద్దు చేసింది.
మరోవైపు వర్షాలు, వరదల నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. దాదాపు రెండు రాష్ట్రాల్లో 86 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వీటితో పాటు 70కి పైగా రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు చెప్పారు. రద్దు అయిన రైళ్లలో సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్‌లు కూడా ఉన్నాయని అధికారులు చెప్పారు. పలు ప్యాసింజర్ రైళ్లు కూడా ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కాజీపేట-డోర్నకల్-కాజీపేట, డోర్నకల్-విజయవాడ-డోర్నకల్, విజయవాడ-గుంటూరు-విజయవాడ రైళ్లను రద్దు చేయగా, ఢిల్లీ-సెంట్రల్ చెన్నై, దానాపూర్-బెంగళూరు రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా రాయపురం-పటేల్ నగర్, హజ్రత్ నిజాముద్దీన్-రేణిగుంట రైళ్లను మరోమార్గంలో మళ్లించారు.