Telangana: టెట్ దరఖాస్తుల గడువు పెంపు
తెలంగాణలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla
Telangana: టెట్ దరఖాస్తుల గడువు పెంపు
తెలంగాణలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇవాళ్టితో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువుని పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ వరకు అంటే మరో పది రోజుల పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని పొడిగించారు. అభ్యర్థులకు తమతమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.
వాస్తవానికి టెట్ దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియాల్సి ఉంది. మంగళవారం నాటికి టెట్‌కు 1,93,135 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పేపర్-1కు 72,771 దరఖాస్తులు రాగా.. పేపర్-2కి 1,20,364 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను గతంతో పోలిస్తే భారీగా తగ్గాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టెట్ దరఖాస్తుల గడువుని మరో 10 రోజులు పొడిగించినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక 2015 నుంచి ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 2.50 లక్షల మంది అర్హత సాధించారు. మరోవైపు టీచర్ పోస్టుల ఎంపికలకు నిర్వహించే డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దాంతో.. డీఈడీ, బీఈడీ పాసైన అభ్యర్థులతో పాటు గతంలో టెట్ పాసైన వారు కూడా మార్కులు పెంచుకునేందుకు ఈ పరీక్షను ప్రతిసారి రాస్తుంటారు.