పిల్లలు చెప్పిన సాక్ష్యం.. తండ్రికి జీవిత ఖైదు
భార్యను చంపిన వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. పిల్లలు చెప్పిన సాక్ష్యంతో ఈ తీర్పు వెల్లడించింది న్యాయస్థానం.
By Srikanth Gundamalla Published on 16 Sep 2023 4:45 AM GMTపిల్లలు చెప్పిన సాక్ష్యం.. తండ్రికి జీవిత ఖైదు
భార్యను బండరాయితో కొట్టి చంపిన వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. అతడి పిల్లలు చెప్పిన సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. ధైర్యంగా సాక్ష్యం చెప్పి తల్లిని చంపిన తండ్రికి శిక్ష విధించేలా చేసిన చిన్నారులను కోర్టు అభినందించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని హనుమాన్‌వాడకు చెందిన రాపాక నాగరాజు, కవిత (37) దంపతులకు కుమారుడు (12), కుమార్తె (4) ఉన్నారు. కూలి పనులకు వెళ్లే నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి బానిసైన నాగరాజు ఇంటిరి రోజూ తాగే వెళ్లేవాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మద్య నిత్యం గొడవలు జరిగేవి. మద్యం సేవించొద్దని ఎంత చెప్పినా నాగరాజు వినలేదు. పైగా భార్యను హింసించేవాడు. ఇది చూసిన పిల్లలు భయం భయంగా గడిపేవారు.
ఈ క్రమంలో 2019 ఏప్రిల్‌లో ఒక రోజు నాగరాజు మళ్లీ తాగి ఇంటికి చేరుకున్నాడు. మరోసారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఆరోజు మరింత ముదరడంతో నాగరాజు క్షణికావేశంలో పిల్లల ముందే భార్యపై తీవ్రంగా దాడి చేశాడు. ఆ తర్వాత బండరాయితో తలపై మోదీ కిరాతకంగా చంపేశాడు. ఈ కేసులో నాలుగేళ్ల పాటు విచారణ కొనసాగింది. చివరకు సెప్టెంబర్ 15న తుది తీర్పు వెల్లడించింది యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు. అమ్మను నాన్నే చంపాడంటూ పిల్లలు కోర్టు ముందు చెప్పారు. ఈ మేరకు మొదటి ఏడీజే కోర్టు నిందితుడు నాగరాజుని దోషిగా నిర్దారించింది. ఆ తర్వాత జీవిత ఖైదు శిక్షను విధించింది. నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఆ ఇద్దరు పిల్లలను కోర్టు అభినందించింది. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించిన న్యాయస్థానం.. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.