నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 500 మంది ఏపీ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. నీటిని విడుదలకు చేసేందుకు ఏపీ అధికారులు ప్రయత్నించగా, అడ్డుకుఉన్న టీఎస్‌ఎస్‌పీఎఫ్ సిబ్బందిని తోసేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది.
నాగార్జున సాగర్ దగ్గర ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా సాగు, తాగు నీటి వివాదాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి పోలింగ్ రోజునే ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇన్నాళ్లూ లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
నాగార్జున సాగర్ డ్యామ్‌పై ఏపీ, తెలంగాణ మధ్య 2015 నుంచి జలవివాదం చోటు చేసుకుంటోంది. నీటి విడుదల విషయంలోనే తరచూ వివాదం తలెత్తుతోంది. సాగర్ డ్యామ్ తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఏపీలోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో ఉంది. అయితే డ్యామ్ నిర్వహణ తెలంగాణ ఆధీనంలో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను ఏపీకి కేటాయించారు. కాగా పోలింగ్ రోజున ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొనడం చర్చనీయాంశంగా మారింది.