తెలంగాణ హైకోర్టుకు నియమితులైన 10 మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం పూరైంది. హైకోర్టు మొదటి కోర్టు హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ నూతన జడ్జిలతో ప్రమాణం చేయించారు. కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి, వెంకట శ్రవణ్‌కుమార్, జీ అనుపమ చ్రకవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏ సంతోష్‌రెడ్డి, డాక్టర్ డీ నాగార్జున్ ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు.
తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం 19 మంది న్యాయమూర్తులు సేవలు అందిస్తుండగా.. కొత్తగా నియమితులైన పది మంది జడ్జిలతో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. అయితే.. హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన అవసరం ఉంది. కాగా.. హైకోర్టులో ఒకేసారి పది మంది న్యాయమూర్తులు నియమితులవడం ఇదే మొదటిసారి. 10మంది న్యాయమూర్తుల్లో నలుగురు మహిళలు ఉండటం విశేషం. దీంతో ఈ హైకోర్టులో మొత్తం మహిళా న్యాయమూర్తుల సంఖ్య 10కి చేరనుంది. మొత్తం న్యాయమూర్తుల్లో మహిళల శాతం 34.48%కి పెరుగుతోంది. ఇక న్యాయమూర్తుల సంఖ్య భారీగా పెరగటంతో పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన జరుగనుంది.