తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోయి ఓ తెలుగు జర్నలిస్ట్ గల్లంతయ్యాడు. అతడు తెలుగు న్యూస్ ఛానెల్ 'ఎన్‌టీవీ'లో పనిచేస్తున్న జమీర్ అని తెలిసింది. జగిత్యాల రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో తన సహోద్యోగితో కలసి కారులో వరద ముంపునకు గురై రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. జమీర్‌తో పాటు మరో ఎన్‌టీవీ జర్నలిస్ట్ ఇర్షాద్ జగిత్యాలలో కూలీ కోసం వెళ్లి వరదల్లో చిక్కుకున్న తొమ్మిది మంది వ్యవసాయ కూలీల గురించి రిపోర్ట్ చేయడానికి వెళ్ళారు. వీరు రాయికల్ మండలం రామోజీపేట, భూపతిపూర్ గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు దాటుతుండగా వాగులో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.
అనంతరం ఇర్షాద్ సురక్షితంగా బయటపడ్డాడు. "నేను చెట్టు కొమ్మను పట్టుకుని పైకి లేవడానికి ముందు చాలా సేపు నీటిలో ప్రయాణించాను. జమీర్ తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను కారు వెనుక సీటులో కూర్చున్నాడు. అతను డోర్ తెరిచాడో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు." అని చెప్పాడు.
జమీర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. "అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. కారు వరద నీటిలో ఉంది. ప్రొక్లైనర్ వచ్చి కారును బయటకు తీయడానికి మేము ఎదురుచూస్తున్నాము" అని ఇర్షాద్ చెప్పాడు. రోడ్డు వరద నీటితో నిండిపోయిందని, చెట్లు విరిగాయని తెలిపారు. సంఘటనా స్థలానికి ప్రజలు రావద్దని ఆయన కోరారు.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం.. గత 24 గంటల్లో, జగిత్యాలలో చాలా భారీ (115.6 మిమీ-204.4 మిమీ) నుండి అత్యంత భారీ (204.5 మిమీ పైన) వర్షపాతం నమోదైంది. జిల్లాలోని వెల్గటూర్‌లో అత్యధికంగా 223.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నం, కోరుట్ల, ధర్మపురిలోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి.
జులై 12, 13 తేదీల్లో జగిత్యాలకు ఐఎండీ హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.