రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచి పోతుంది - గవర్నర్ తమిళిసై

Telangana’s history it will be written that Constitution is not respected - Guv TamiliSai. గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా, పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం నిర్వహించలేదని,

By Nellutla Kavitha  Published on  26 Jan 2023 7:47 PM IST
రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచి పోతుంది - గవర్నర్ తమిళిసై

గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా, పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం నిర్వహించలేదని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. గణతంత్ర వేడుకలను ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాను రెండు నెలల క్రితమే లేఖ రాశానని, అయితే వేడుకలను రాజభవన్ లోనే జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనకు రెండు రోజుల క్రితం లేఖ రాసిందని పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడారు గవర్నర్. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు గవర్నర్ తమిళిసై.

రిపబ్లిక్ డే వేడుకలను ప్రజల మధ్య జరగకుండా చేయాలని ప్రయత్నించారని, అయితే ఒక శ్రేయోభిలాషి కోర్టుకు వెళ్లడంతో వేడుకలకు అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు గవర్నర్. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల నుంచి వచ్చిన దాన్ని కావడంతో తాను జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని గవర్నర్ పేర్కొన్నారు. తనకు రాసిన లేఖలో కనీసం సీఎం హాజరవుతారని కూడా లేదని, ప్రసంగ పాఠాన్ని కూడా పంపించలేదని వ్యాఖ్యానించారు గవర్నర్ తమిళిసై.


ఇక ఈరోజు రాజభవన్ లో జరిగిన గణతంత్ర వేడుకలకు సీఎస్ శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్ తో సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తాను కొంతమందికి నచ్చకపోవచ్చని, అయితే తెలంగాణ వాళ్లంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే ఎంతో కష్టపడి పని చేస్తానని గవర్నర్ జెండా ఆవిష్కరణ తర్వాత వ్యాఖ్యానించారు. కొత్త భవనాలు మాత్రమే అభివృద్ధి కాదు జాతి నిర్మాణం కావాలి అని, ఫామ్ హౌస్ ల మీద కూడా పరోక్షంగా వ్యాఖ్యానించారు గవర్నర్. రైతులు, పేదలందరికీ భూములు, ఇళ్లు కావాలని, తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు.

గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌పై చేసిన పరోక్ష విమర్శలపై స్పందించారు బి.ఆర్.ఎస్ నేతలు. ఫామ్‌హౌస్‌లు ఉండటమే నేరమైతే 2019 మీరు కొనుగోలు చేసిన ఫామ్‌హౌస్ సంగతేంటా?! అని BRS నేత క్రిశాంక్ ట్వీట్‌ చేశారు.

ఈరోజు ఉదయం అమరవీరులకు నివాళులు అర్పించిన గవర్నర్, రాజ్ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి ,ప్రసంగించారు. ప్రముఖులను సత్కరించిన అనంతరం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లారు. లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పుదుచ్చేరిలో పాల్గొన్న అనంతరం తిరిగి సాయంత్రం హైదరాబాదుకు బయలుదేరి వచ్చారు గవర్నర్. ఇక రాజ్ భవన్ లో ఆనవాయితీగా జరిగే ఎటు హోం కార్యక్రమానికి సీఎం సహా మంత్రులను ఇతర ఉన్నతాధికారులను ప్రముఖులను ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి కూడా సీయం సహా ఇతర మంత్రివర్గ సహచరులెవరూ హాజరుకాకపోవడం కొసమెరుపు.

Next Story