Telangana: నేడు సచివాలయం ముట్టడికి నిరుద్యోగుల పిలుపు

తెలంగాణ నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. పలు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  15 July 2024 7:01 AM IST
telangana, youth, protest, secretariat, dsc postpone,

 Telangana: నేడు సచివాలయం ముట్టడికి నిరుద్యోగుల పిలుపు

తెలంగాణ నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. పలు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా సహా ఇతర డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

సచివాలయ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తమవి న్యాయమైన డిమాండ్లు అని వాటిని నెరవేర్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరిస్తున్నారు నిరుద్యోగులు. రోజురోజుకు నిరసనలను ఉధృతం చేస్తున్నారు. పోలీసులు నిరుద్యోగులను కట్టడి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సెక్రటెరియట్‌ ముట్టడిని అడ్డుకునేందుకు నిరుద్యోగులను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నట్లు సమాచారం. అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్, ఉస్మానియా యూనివర్సిటీల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. నగరంలోని అశోక్‌నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో బుక్‌స్టోర్స్, టీస్టాళ్లను మూసివేయించారు. గల్లీల్లో పహారా కాస్తున్నారు. సెక్రటేరియట్‌కు వచ్చే దా రుల్లో పోలీసులు భారీగా మోహరించారు.

కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి పరీక్షలు వాయిదా వేయము అనీ.. పరీక్ష రాయనివారే ఆందోళనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్ తర్వాత శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నిరుద్యోగులు నిరసన దీక్ష చేశారు. అశోక్‌నగ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో నిరసనలతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఆందోళనలు మరింత తీవ్రరూపం దాలుస్తాయనే అనుమానంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ సెక్రటెరియట్‌ ముట్టడికి పిలుపునివ్వడం మరింత ఆసక్తిగా మారింది.

Next Story