తెలంగాణలో వైన్‌షాప్ టెండర్ల జోరు..ఇప్పటికే రూ.1400కోట్ల ఆదాయం
తెలంగాణలో వైన్ షాపు టెండర్లకు అనూహ్య స్పందన వస్తోంది. లైసెన్స్‌లను పొందేందుకు ఆశావాహులు తీవ్రంగా పోటీపడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 11 Aug 2023 1:45 PM ISTతెలంగాణలో వైన్‌షాప్ టెండర్ల జోరు..ఇప్పటికే రూ.1400కోట్ల ఆదాయం
తెలంగాణలో వైన్ షాపు టెండర్లకు అనూహ్య స్పందన వస్తోంది. వైన్స్ లైసెన్స్‌లను పొందేందుకు ఆశావాహులు తీవ్రంగా పోటీపడుతున్నారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 6,913 దరఖాస్తులు వచ్చాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1400 కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం అందుతోంది. కాగా.. ఆగస్టు 4న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవ్వగా.. ఆగస్టు 10న ఒక్కరోజే ఏకంగా 3,140 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న వైన్‌షాపుల అనుమతుల గడువు ఈ సంవ్సతరం నవంబర్‌తో ముగియనుంది. దాంతో..వైన్ షాపులకు కొత్త లైసెన్స్‌ల కోసం మూడు నెలల ముందుగానే టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 21న డ్రా పద్ధతిలో వైన్ షాపులను కేటాయిస్తారు అధికారులు. ఈ వైన్‌షాపు లైసెన్స్‌ల కోసం ఆశావాహులు పెద్ద ఎత్తున దరఖాస్తులు పెడుడుతున్నారు. ఒక్కో దరఖాస్తు రూ.2లక్షలు.. నాన్‌రీఫండబుల్ అయినా ఏమాత్రం తగ్గడం లేదు. తెలంగాణలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికి ఆగస్టు 8వ తేదీ నాటికే 2వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం.
2023-25 నాటికి తెలంగాణలో మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సులు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాంతో.. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా రాజకీయ నేతలు, వారి అనుచరులు దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వైన్స్ లైసెన్స్‌ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం. దరఖాస్తులకు చివరి తేదీ ఇంకో వారం రోజులు మిగిలే ఉంది. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది. మరికొద్ది రోజులు మిగిలి ఉండటంతో.. ఇంకా ఎన్ని దరఖాస్తులు దాఖలు అవుతాయో అనుకుంటున్నారు ప్రజలు. ఇక ఆగస్టు 21న లాటరీ పద్దతిలో వైన్స్ షాపుల లైసెన్స్‌లను కేటాయిస్తారు అధికారులు. గత నోటిఫికేషన్‌లో నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద రూ.1,350 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి గతంలో కన్నా ఎక్కువ దరఖాస్తులు నమోదు అవుతుండటంతో.. ఆదాయం కూడా భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పైగా ఎన్నికల సమయం కావడంతో దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొందరు రాజకీయ పలుకుబడితో టెండర్ తమకే రావాలని మిగతావారిని అడ్డుకుంటుంటారు. ఈ క్రమంలో అలాంటి వారికి ఎక్సైజ్ శాఖ వార్నింగ్ ఇచ్చింది. టెండర్లు వేసే వారిని ఎవరూ అడ్డుకోవద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.