తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు

ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.

By Srikanth Gundamalla
Published on : 16 March 2024 7:32 AM IST

telangana, weather, imd, temperature,

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు 

కొద్దిరోజులు నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో మధ్యాహ్నం వేళలలో జనాలు బయట కాలు పెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాబోయే మూడ్రోజుల పాటు ఎండల తీవ్రత తగ్గనున్నట్లు చెప్పింది. దాంతో.. ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనున్నట్లు తెలిపింది.

రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు కాస్త తగ్గుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. ఇక ఎండల వేడిమితో హైదరాబాద్‌ ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో.. నగరంలో కూడా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 18వ తేదీ వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగమంచు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని వివరించింది.

గురువారం వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వివిధ జిల్లాల్లో 41 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 40.09 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. నగరంలోని పాటిగడ్డలో అధికంగా గురువారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఐఎండీ అంచనా ప్రకారం వాతావరణం చల్లబడి అక్కడక్కడ వర్షాలు పడితే బాగుండు అని ప్రజలు అంటున్నారు.

Next Story