విజేతలుగా తెలంగాణకు చెందిన నిర్మల్, సోమశిల గ్రామాలు

పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఉత్తమ పర్యాటక గ్రామాల పోటీ-2024లో తెలంగాణకు చెందిన నిర్మల్, సోమశిల విజేతలుగా నిలిచాయి.

By Medi Samrat  Published on  27 Sept 2024 6:58 PM IST
విజేతలుగా తెలంగాణకు చెందిన నిర్మల్, సోమశిల గ్రామాలు

పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఉత్తమ పర్యాటక గ్రామాల పోటీ-2024లో తెలంగాణకు చెందిన నిర్మల్, సోమశిల విజేతలుగా నిలిచాయి. క్రాఫ్ట్ విభాగంలో నిర్మల్.. ఆధ్యాత్మిక, వెల్నెస్ విభాగంలో సోమశిల విజేతగా నిలిచింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్ టాయ్స్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్ పెంటయ్యతో కలిసి అవార్డును అందుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి టి.నరసింహ అవార్డును అందుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షత వహించగా ఉపాధ్యక్షుడు జగదీప్‌ ధన్‌ఖర్‌ అవార్డులను ప్రదానం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అహోబిలం ఆధ్యాత్మిక, వెల్నెస్ విభాగంలో విజేతగా నిలిచిందని పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంత్రిత్వ శాఖ ఉత్తమ పర్యాటక గ్రామాల పోటీ-2024 విజేతలను ప్రకటించింది. సోల్ ఆఫ్ ఇండియా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, 2023లో ఉత్తమ పర్యాటక గ్రామాల పోటీని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. 2023లో జరిగిన మొదటి ఎడిషన్ లో పోటీకి 795 గ్రామాల నుండి దరఖాస్తులు వచ్చాయి. రెండవ ఎడిషన్‌లో మొత్తం 991 దరఖాస్తులు అందాయి.

Next Story