ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని కోరుతూ సోనియా, రాహుల్, రేవంత్‌ల‌కు పోస్టుకార్డులు రాసిన గ్రామస్తులు

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఆరు హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీతోపాటు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు

By Medi Samrat  Published on  14 Oct 2024 2:13 PM IST
ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని కోరుతూ సోనియా, రాహుల్, రేవంత్‌ల‌కు పోస్టుకార్డులు రాసిన గ్రామస్తులు

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఆరు హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీతోపాటు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా గ్రామస్థులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకు పోస్టుకార్డులు పంపారు. ఆరు హామీల అమలులో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా పోస్టుకార్డులు పంపారు.

100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని.. అధికారంలోకి వచ్చి 300 రోజులు పూర్తయినా అమలు చేయలేదని రాహుల్ గాంధీకి గుర్తు చేశారు. సామాజిక భద్రత పింఛన్లు నెలకు రూ.2,000 నుంచి రూ.4వేలకు పెంచడం, ఇంటిలోని ప్రతి మహిళకు ఇస్తామ‌న్న 2500 రూపాయ‌లు, కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు తులం బంగారం, రైతులకు ఎకరాకు రూ.15,000 ఇన్‌పుట్ పెట్టుబడి, రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ, విద్యార్థినులకు స్కూటర్లు వంటి హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని గ్రామస్తులు పోస్టుకార్డులలో రాశారు. కాంగ్రెస్ పార్టీ తన హామీలను నిలబెట్టుకోకుంటే న్యూఢిల్లీలో నిరసన తెలుపుతామని గ్రామస్తులు తెలిపారు.

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. గ్రామస్తులు పంపిన పోస్ట్‌కార్డ్‌తో పాటు గ్రామస్థులు చేతిలో పోస్ట్‌కార్డులు పట్టుకుని ఉన్న ఫొటోలను ‘X’లో పోస్ట్ చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోపు ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 300 రోజులకు పైగా అయ్యింది.. హామీల అమ‌లుపై పురోగతి సంకేతాలు లేవు.. మీ ద్రోహాన్ని ప్రజలు స్పష్టంగా చూడగలుగుతున్నారు మిస్టర్ గాంధీ అని కేటీఆర్ ట్వీట్‌లో రాశారు.

Next Story