ఫిట్నెస్ సర్టిఫికెట్‌కు రేడియం స్టిక్కర్ లింక్.. తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం!

రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ చేపట్టిన రేడియం స్టిక్కర్ల నిబంధన ప్రస్తుతం వాహన యజమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.

By -  అంజి
Published on : 12 April 2026 9:48 AM IST

Radium Stickers Mandate, Vehicle Fitness Certificate, RTA Regulations, Road Safety Measures, QR Code Reflectors, Transport Department Telangana, Heavy Vehicle Owners Issues

ఫిట్నెస్ సర్టిఫికెట్‌కు రేడియం స్టిక్కర్ లింక్.. తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం!

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ చేపట్టిన రేడియం స్టిక్కర్ల నిబంధన ప్రస్తుతం వాహన యజమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. రాత్రి వేళల్లో రహదారుల పక్కన నిలిపి ఉంచే వాహనాల వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలను అరికట్టేందుకు, ప్రతి వాహనానికి రిఫ్లెక్టెడ్ (రేడియం) స్టిక్కర్లను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు దీనిని వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్ (FC) తో అనుసంధానించారు.

అధికారుల కొత్త నిబంధన ప్రకారం.. ఇకపై వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలంటే, క్యూ ఆర్ కోడ్ (QR Code) కలిగిన రేడియం స్టిక్కర్లను వాహనానికి నాలుగు వైపులా విధిగా అతికించాలి. ఈ స్టిక్కర్‌లోని క్యూ ఆర్ కోడ్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసిన తర్వాతే, రవాణా శాఖ వెబ్‌సైట్‌లో ఫిట్నెస్ కోసం దరఖాస్తు చేసుకునే లాగిన్ ఓపెన్ అవుతుంది. భద్రతా పరంగా ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ, భారీ వాహన యజమానులకు మాత్రం ఇది పెను భారంగా మారింది.

ప్రతి ఏటా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుందని, అలా ప్రతిసారీ కొత్తగా రేడియం స్టిక్కర్లను కొనుగోలు చేయడం ఆర్థికంగా ఇబ్బందికరమని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వాహనానికి రేడియం స్టిక్కర్ల కోసం సుమారు రూ. 3,500 వరకు ప్రభుత్వం నిర్ణయించగా, సరఫరా చేసే సంస్థలు దాన్ని అదునుగా తీసుకుని రూ. 5,000 వరకు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మూడు నెలలకోసారి రోడ్డు ట్యాక్స్ చెల్లిస్తున్నామని, ఇప్పుడు రేడియం స్టిక్కర్ల పేరుతో తమను దోపిడీ చేస్తున్నారని వారు వాపోతున్నారు. ఈ నిబంధనలను సవరించాలని యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story