Telangana: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు
తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువుని ప్రభుత్వం మరోసారి పెంచింది.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 5:21 PM ISTTelangana: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు
తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువుని ప్రభుత్వం మరోసారి పెంచింది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఇంతకుముందు ప్రకటించిన రాయితీల ద్వారానే చలాన్లు కట్టుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే.. ముందుగా అధికారులు రాయితీల గడువు మరోసారి పొడిగించే అవకాశాలు ఉండవని చెప్పారు. కానీ.. ప్రభుత్వం మాత్రం గడువును పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
కాగా.. గత ఏడాది డిసెంబర్ 27 నుంచి పెండింగ్ చలాన్లను రాయితీతో కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. తొలుత పదిహేను రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని చెప్పారు. కానీ గడువు వరకు ఆశించిన స్థాయిలో వాహనదారులు చలాన్లను చెల్లించుకోలేదు. దాంతో ప్రభుత్వం మరోసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో జనవరి 10 నుంచి జనవరి 31 వరకు పెండింగ్ చలాన్లు రాయితీల ద్వారా కట్టే అవకాశం ఇచ్చారు. అయితే.. బుధవారమే ఈ ఆఫర్ ముగియాల్సి ఉండగా ప్రభుత్వం మరోసారి ఈ అవకాశాన్ని పొడిగింది. కాగా.. బైక్, ఆటోలకు పెండింగ్ చలాన్ల చెల్లింపులో 80 శాతం డిస్కౌంట్ ఇస్తుండగా.. ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం ఆఫర్ ప్రకటించారు.
దాదాపుగా నెలకు పైగా సమయం దొరికినా కూడా పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించలేదు. ఆఫర్ పెట్టినా కూడా తెలంగాణ వ్యాప్తంఆ ఉన్న 3.59 కోట్ చలాన్లకు ఇప్పటి వరకు 1,52,47,684 చలాన్లు కట్టారు. దీని ద్వారా రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే.. ఇంకా వసూలు కావాల్సిన పెండింగ్ చలాన్లు కోటికి పైగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆఫర్‌ను పొడిగించింది.