Telangana: త్వరలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై రాయితీ!
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు పోలీసు శాఖ మరోసారి సిద్ధం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 22 Dec 2023 5:04 AM GMTTelangana: త్వరలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై రాయితీ!
వాహనదారుల క్షేమంతో పాటు.. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు, ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు తీసుకొచ్చాయి. అయితే.. కొందరు మాత్రం రూల్స్‌ను ఏమాత్రం పట్టించుకోరు.. చట్టాలు తమ చుట్టాలు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. వేల రూపాయల్లో ఫైన్లు చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోరు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతుంటారు. అలాంటి వారి నుంచి చలాన్లు తీసుకునేలా అధికారులు రాయితీలు ప్రకటిస్తుంటారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు పోలీసు శాఖ మరోసారి సిద్ధం అవుతోంది. ఇందుకు భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారులు ఆలోచిస్తున్నారు. గత సంవత్సరం ఇలానే రాయితీ ప్రకటించారు అధికారులు. దానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రూ.300 ఓట్ల వరకు చలానాలు వసూలు అయ్యాయి. ఇదే క్రమంలో మరోసారి రాయితీ ఇచ్చి.. ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు అన్ని పట్టణాల్లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు చలాన్లు విధిస్తారు. సీసీ కెమెరాల ద్వారా రూల్స్ అతిక్రమించినవారిపై చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో చాలా మంది చలాన్లు తిరిగి చెల్లించడం లేదు. పోలీసులు తనిఖీలు చేసి.. వాహనం నంబరు ఆధారంగా గుర్తించి ఆపినప్పుడు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో చలాన్లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మరోసారి భారీ ఎత్తున పెండింగ్ చలాన్లు ఉండిపోయాయి. వాటిని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో గతేడాది ప్రత్యేక రాయితీ ద్వారా వసూలు చేశారు. 75 రాయితీ బైకులకు, మిగతా వాటికి 50 శాతం ప్రకటించడంతో వాహనదారులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చలాన్లను చెల్లించారు. 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత మరోసారి పెండింగ్ చలాన్లు పెరిగిపోయాయి.2 కోట్లకు పైగా చలాన్లు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాయితీ ప్రకటించి వాటిని దాదాపుగా క్లియర్ చేసేలా రాయితీలు ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు.