ఎన్నికల వేళ తెలంగాణలో పట్టుబడ్డ మొత్తం నగదు ఎంతంటే..?

తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు.

By Srikanth Gundamalla  Published on  12 May 2024 7:35 AM GMT
Telangana,  seized money,  election,

 ఎన్నికల వేళ తెలంగాణలో పట్టుబడ్డ మొత్తం నగదు ఎంతంటే..?

తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. శనివారం సాయంత్రంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్‌ జరుగుతుంది. ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు చెప్పారు. పోలింగ్‌ను సక్రమంగా నిర్వహించడం కోసం 73,414 మంది సివిల్ పోలీసులు, 500 సెక్షన్ల టీఎస్‌ఎస్‌పీ సిబ్బంది, 164 కంపెనీల కేంద్ర బలగాలు, 3 కంపెనీల తమిళనాడు పోలీసులు, 2088 మంది ఇతర సిబ్బంది, 7వేల మంది హోంగార్డులు విధుల్లో పాల్గొంటారని పోలీసులు చెప్పారు.

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మార్చి 16 వ తేదీ నుంచి శనివారం అంటే మే 11వ తేదీ వరకు భారీగా సొత్తును సీజ్ చేశామని డీజీపీ రవి గుప్తా చెప్పారు. మొత్తం రూ.186.12 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేశామని చెప్పారు. వీటిలో రూ.93.94 కోట్ల నగదు, రూ.10.07 కోట్ల విలువైన మద్యం, రూ.7,86 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.62.77 కోట్ల విలువైన బంగారం సీజ్‌ చేశామని వెల్లడించారు. అలాగే రూ.11.48 కోట్ల విలువైన ఇతర పంపిణీ సామగ్రిని కూడా సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు డ్రగ్స్ కంట్రోల్ యాక్ట్, ఎక్సైజ్‌ చట్టం, ఐపీసీ, ప్రజాప్రాతినిథ్య చట్టం కింద మొత్తం 8,863 కేసులు నమోదు చేశామని అన్నారు. వీటిలో ఒక్క ఎక్సైజ్‌ చట్టం కిందే 8,044 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని చెప్పారు. నార్కోటిక్స్‌ కేసుల్లో 293, ఐపీసీ సెక్షన్ల కింద 473, ఆర్‌పీ యాక్ట్‌ కింద 53 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడించారు. 34,526 మందిని మందుస్తుగా బైండోవర్‌ చేశామని తెలంగాణ పోలీసులు వెల్లడించారు.

మరోవైపు పోలింగ్‌కు మరో రోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరింత పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. పటిష్ట నిఘా ఉంటుందనీ.. అక్రమంగా నగదు.. ఇతర సొత్తు రవాణా చేస్తే సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తామని డీజీపీ రవి గుప్తా హెచ్చరించారు.

Next Story