Telangana: తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతంలో కోత.. నేడు అసెంబ్లీలో బిల్లు
వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక బిల్లును సిద్ధం చేసింది. శనివారం శాసనసభలో ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం...
By - అంజి |
Telangana: తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతంలో కోత.. నేడు అసెంబ్లీలో బిల్లు
హైదరాబాద్: వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక బిల్లును సిద్ధం చేసింది. శనివారం శాసనసభలో ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026’ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనం నుంచి కొంత మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా ఈ చట్టం రూపొందించబడింది.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలహీనపడటం, పిల్లలు నగరాలకు వలస వెళ్లడంతో గ్రామాల్లో తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లు ప్రకారం.. బాధితులైన తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ లేదా ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. సదరు అధికారి విచారణ చేపట్టి, ఉద్యోగి వేతనంలో 15 శాతం లేదా రూ.10,000 (ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది) భృతిగా నిర్ణయించి, నేరుగా తల్లిదండ్రుల ఖాతాకు మళ్లించేలా ఆదేశాలు జారీ చేస్తారు.
దరఖాస్తు అందిన 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జిల్లా స్థాయి అధికారి నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి వయోవృద్ధుల కమిషన్‌లో 45 రోజుల్లోపు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. తల్లిదండ్రుల్లో ఒకరు మరణించినా ఆ భృతి మరొకరికి అందుతుంది. ఇద్దరూ మరణించిన పక్షంలో, సంబంధిత ఆధారాలను సమర్పిస్తే 30 రోజుల్లోగా ఆ మినహాయింపు ఆదేశాలను రద్దు చేస్తారు.
ఈ బిల్లును సచివాలయంలో కొత్తగా చేరిన గ్రూప్-2 ఉద్యోగులతో రాయించడం విశేషం. నైతిక బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా తెస్తున్న ఈ చట్టం ద్వారా రాష్ట్రంలోని సుమారు 3.40 కోట్ల మంది లబ్ధిదారుల కుటుంబాల్లో మార్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.