తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక నేరుగా మీ ఇంటికే ఆర్సీ, డీఎల్!

రాష్ట్రంలో వాహనదారులకు ఊరటనిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు...

By -  అంజి
Published on : 28 March 2026 7:43 AM IST

Centralised RC Printing, Driving License Dispatch, Telangana Transport Department, RTO Reforms, Revanth Reddy Decision, Smart Card Distribution, User Charges Fund

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక నేరుగా మీ ఇంటికే ఆర్సీ, డీఎల్!

హైదరాబాద్: రాష్ట్రంలో వాహనదారులకు ఊరటనిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (RC), డ్రైవింగ్ లైసెన్సుల (DL) ముద్రణ, పంపిణీ ప్రక్రియను 'సెంట్రలైజ్డ్' (కేంద్రీకృత) చేయాలని నిశ్చయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 61 ఆర్టీఓ (RTO) కార్యాలయాల ద్వారా జరుగుతున్న ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నూతన విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి కార్డులు ముద్రించబడి, నేరుగా వాహనదారుడి ఇంటి చిరునామాకే పోస్ట్ ద్వారా చేరుతాయి.

రాష్ట్రంలో ఏటా సగటున 4.70 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు, 9.90 లక్షల వాహన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అంటే సుమారు 15 లక్షల కార్డులను ప్రతి ఏటా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న విధానంలో ముద్రణ ఆలస్యం కావడం, కార్డులు ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం వంటి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనివల్ల వాహనదారులు కార్డుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే, మధ్యవర్తుల ప్రమేయం పూర్తిగా తొలగిపోవడమే కాకుండా, కార్డులు పోగొట్టుకుని మళ్లీ డూప్లికేట్ కార్డుల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు, రవాణా శాఖకు ఏటా లభిస్తున్న దాదాపు రూ. 135 కోట్ల యూజర్ ఛార్జీలను తిరిగి అదే శాఖకు కేటాయించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం రవాణా శాఖ ద్వారా ఏడాదికి రూ. 6,900 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఈ యూజర్ ఛార్జీల నిధులను శాఖా పరమైన మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ విధానం ద్వారా రవాణా శాఖలో పారదర్శకత పెరగడంతో పాటు వాహనదారులకు సకాలంలో సేవలు అందుతాయి.

Next Story