Telangana: ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమే!
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది.
By Srikanth Gundamalla
Telangana: ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమే!
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురే అభ్యర్థులు మిగిలారు. దాంతో.. వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఏకగ్రీవం కాగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక కూడా ఏకగ్రీవం అవ్వనుంది.
కాగా.. ఈ ఎన్నిక కోసం మరో ముగ్గురు నామినేసన్లు దాఖలు చేయగా రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు. శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, స్వతంత్ర్య అభ్యర్థిగా కిరణ్ రాథోడ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఒక్కో అభ్యర్థికి మద్దతుగా కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకం చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు మినహా.. ఇతర ముగ్గురు అభ్యర్థులకు ఎమ్మెల్యేలు ఎవరూ సంతకాలు చేయలేదు. దాంతో.. వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తర్వాత కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ సభ్యులుగా రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు.
ఇటీవల రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. కానీ.. తెలంగాణలో మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులే మిగలడంతో ఎన్నిక ఏకగ్రీవం అవ్వనుంది.