నాన్న కాపాడు అంటూ బాలిక మాటలు.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మృతి
ఓ టెన్త్ విద్యార్థి తీవ్ర జ్వరంతో బాధ పడింది.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 9:30 AM ISTనాన్న కాపాడు అంటూ బాలిక మాటలు.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మృతి
ఓ టెన్త్ విద్యార్థి తీవ్ర జ్వరంతో బాధ పడింది. అయితే.. పరిస్థితి విషమించడంతో ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు ఆమె తండ్రి. ఈ నేపథ్యంలో ఆ బాలిక తండ్రితో నాన్న నన్ను కాపాడు అంటూ చివరి మాటలను పలికింది. హైదరాబాద్‌కు మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడించింది. కూతురుని కాపాడుకోలేకపోయానని తండ్రి గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. ఈ సంఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేటలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
గుండాయిపేటకు చెందిన జాడె కిశోర్, సురేఖ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె పూజ (16) జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఆమెకు జ్వరం వచ్చింది.దాంతో.. గత శనివారం తండ్రికి ఫోన్ చేసింది. బాగా జ్వరం వచ్చిందనీ.. కాళ్లు చేతులు బాగా లాగుతున్నాయనీ.. ఇంటికి తీసుకెళ్లాలంటూ కోరింది. దాంతో.. తండ్రి కూడా హాస్టల్‌కు వెళ్లి కూతురుని తీసుకెళ్లాడు. స్థానిక ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించాడు. అయితే.. జ్వరం ఏమాత్రం తగ్గలేదు. పైగా శుక్రవారం సాయంత్రానికి పరిస్థితి విషమించింది. కుటుంబ సబ్యులు వెంటనే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం నాటికి పరిస్థితి మరింత విషమించింది.
అక్కడి వైద్యుల సూచనతో హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు అంబులెన్స్‌లో వస్తున్నారు. మార్గమధ్యలోనే పూజ తన తండ్రి చేయి పట్టుకుని నాన్న నన్ను కాపాడు అంటూ ఏడ్చింది. తండ్రి కూడా ఏంకాదు అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ.. మార్గమధ్యలోనే ప్రాణాలు విడించి పూజ. కాగా.. కొన్నాళ్లుగా గుండాయిపేట గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లో బాధితులు ఉన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు.