ఎమ్మెల్సీలుగా తీన్మార్ మల్లన్న, నవీన్‌కుమార్‌రెడ్డిలు ప్రమాణస్వీకారం
ఇటీవల తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 13 Jun 2024 4:45 PM ISTఎమ్మెల్సీలుగా తీన్మార్ మల్లన్న, నవీన్‌కుమార్‌రెడ్డిలు ప్రమాణస్వీకారం
ఇటీవల తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. నల్లగొండ, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలు జరగ్గా.. వీటిలో గెలిచిన తీన్మార్ మల్లన్న, నవీన్‌కుమార్ రెడ్డి శాసనమండలిలోకి అడుగుపెట్టారు. తాజాగా గురువారం వీరు ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. తీన్మార్ మల్లన్న ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరు అయ్యారు.
కాగా.. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ్యునిగా ఎన్నిక కాగా, ఆయన రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై, బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి ఘనవిజయం సాధించారు. నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అక్కడి స్థానం ఖాళీ అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించగా.. తీన్మార్ మల్లన్న విజయం సాధించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. పాలమూరు జిల్లా సీఎం రేవంత్‌రెడ్డి కాదనీ.. కేసీఆర్‌దే అని తన గెలుపుతో నిరూపితం అయ్యిందన్నారు. 420 హామీలు చెప్పి అమలు చేయని కాంగ్రెస్ పార్టీ తీరు చూసి తనని గెలిపించారని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.