తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం: రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందన్నారు కాసాని జ్ఞానేశ్వర్.

By Srikanth Gundamalla  Published on  13 Aug 2023 6:00 PM IST
Telangana, TDP, State Elections, Kasani Gnaneshwar ,

తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం: రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఎన్నికల గురించి మాట్లాడారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు.

నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ పరిధిలో మేడ్చల్‌ పార్లమెంటరీ పార్టీ స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఖమ్మం సభకు విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోందని ఆయన ఆచెప్పారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ బాధ్యతలు తీసుకున్నాక చురుగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజా కార్యాచరణపై పార్టీ శ్రేణులకు వివరాలు తెలిపారు. ఆగస్టు 23 నుంచి టీటీడీపీ బస్సు యాత్ర చేపడుతుందని చెప్పారు. ఈ బస్సు యాత్రలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని తెలిపారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయం నుంచి ప్రారంభమయ్యే యాత్ర.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతుందని తెలిపారు. ఆ తర్వాత జిల్లాల్లో బస్సు యాత్రను కొనసాగిస్తామని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ చెప్పారు.

ఎన్నికలకు సిద్ధం అవ్వాలంటూ టీడీపీ శ్రేణులకు కాసాని పిలుపునిచ్చారు. టీడీపీకి ప్రత్యేక గుర్తింపు ఉన్న మల్కాజిగిరిలో వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా పని చేయాలని కార్యకర్తలను సూచించారు. మల్కాజిగిరిలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టి పోటీ చేయిస్తుందని భయపడి.. బీఆర్ఎస్‌ నాయకులు తరచూ ఇంకా ఎక్కడ టీడీపీ ఉందంటూ గాలి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన పార్టీ టీడీపీ అని.. ప్రజలను మేల్కొలిపి ఓటు వేసేందుకు తీసుకురావాలంటూ కోరారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని.. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదన్న వారికి ఈ సారి ఎన్నికలే సమాధానం చెప్పాలన్నారు కాసాని జ్ఞానేశ్వర్.

Next Story