ఉన్నత చదువుల కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి కెనడాకు వెళ్లిన ఓ విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన నారాయణరావు, హైమావతిల కుమారుడైన ప్రవీణ్ రావు ఉన్నత చదువుల కోసం 2015లో కెనడా వెళ్లాడు. అయితే.. ఏమైందో ఏమో తెలీదు గానీ.. ఈ రోజు ఉదయం తాను ఉంటున్న భవనం పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా.. ప్రవీణ్ రావు మృతికి గల కారణాలు తెలియరాలేదు. అతడి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ అతడిని చదివిస్తున్నారు.
ప్రవీణ్ రావు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు నారాయణారావు, హైమావతి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్ రావు మృతి చెందడంతో అతడి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. సాధారణ రైతు కుటుంబానికి చెందిన ప్రవీణ్ రావు.. ఉన్నతాశయాలతో విదేశాలకు వెళ్లాడని.. కానీ తన లక్ష్యం నెరవేరకముందే ప్రాణాలొదలడంపై ఆయన కుటుంబీకులు, గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అతడి మృతిపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.