రేపట్నుంచే టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం రేవంత్
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు రేపటి (మార్చి 14) నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
By - అంజి |
రేపట్నుంచే టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం రేవంత్
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు రేపటి (మార్చి 14) నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అటు విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న 5,17,727 మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పదో తరగతి పరీక్షలు భవిష్యత్తుకు తొలిమెట్టు అని, విద్యార్థులు ఎటువంటి భయం, ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాసి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు.
10వ తరగతి పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను ఉదయం 9:35 గంటల తర్వాత అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. కాబట్టి విద్యార్థులు కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షా కేంద్రాలను పూర్తిస్థాయిలో 'నో సెల్ ఫోన్ జోన్'లుగా ప్రకటించారు. విద్యార్థులే కాకుండా తనిఖీకి వచ్చే అధికారులు, స్క్వాడ్ సిబ్బంది కూడా మొబైల్ ఫోన్లను లోపలికి తీసుకెళ్లకూడదు. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే తక్షణమే సస్పెండ్ చేస్తామని, పేపర్ లీకేజీలకు పాల్పడే సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల యూనిఫాం ధరించి రాకూడదని విద్యాశాఖ డైరెక్టర్ ప్రత్యేకంగా సూచించారు. కేవలం హాల్ టికెట్, పెన్నులు, పెన్సిల్, స్కేల్, జామెట్రీ పరికరాలను మాత్రమే వెంట తెచ్చుకోవాలి. విద్యార్థులు ఒకరోజు ముందుగానే తమ పరీక్షా కేంద్రాలను చూసుకోవడం ద్వారా చివరి నిమిషంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. పరీక్షలు జరుగుతుండగానే ఏప్రిల్ 1 నుండి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వం పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్!