సీనియర్ IPS అధికారి రాజీవ్ రతన్ కన్నుమూత, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 10:57 AM ISTసీనియర్ IPS అధికారి రాజీవ్ రతన్ కన్నుమూత, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా పనిచేస్తున్నారు. హఠాత్తుగా రాజీవ్ రతన్‌కు గుండెపోటు రావడంతో చనిపోయారు. కాగా.. మంగళవారం ఉదయం రాజీవ్ రతన్‌కు గుండెపోటు రాగానే వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత.. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
కాగా.. రాజీవ్ రతన్ 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా పనిచేస్తున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు రాజీవ్ రతన్ సారథ్యం వహించారు. రాజీవ్ రతన్ సమర్ధవంతమైన అధికారిగా పేరు సంపాదించున్నారు. ఇక గతంలో కూడా వివిధ పోస్టుల్లో రాజీవ్ రతన్ పనిచేశారు. కరీంనగర్ ఎస్పీగా, ఫైర్ సర్వీసెస్ డీజీగా కూడా రాజీవ్ రతన్ పనిచేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వివిధ హోదాల్లో రాజీవ్ రతన్ పని చేశారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి రాజీవ్ రతన్ అందించిన విశిష్టమైన సేవలను సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్ధవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. రాజీవ్ రతన్ మరణం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారి, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది.
— Revanth Reddy (@revanth_anumula) April 9, 2024
ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.