తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: ఒకే విడతలో 'రైతు భరోసా' నిధులు!
తెలంగాణలో సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
By - అంజి |
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: ఒకే విడతలో 'రైతు భరోసా' నిధులు
తెలంగాణలో సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ఒకే విడతలో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గతంలో ఉన్న జాప్యాన్ని నివారించి, రైతులకు సకాలంలో ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా ఈ కీలక మార్పు చేపట్టింది. గతంలో రైతు బంధు లేదా రైతు భరోసా నిధులను ఎకరాల వారీగా విడుదల చేసేవారు.
అంటే, తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ముందుగా, ఆ తర్వాత ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి విడతల వారీగా నిధులు అందేవి. దీనివల్ల మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 9 నుండి 10 రోజుల సమయం పట్టేది. ఫలితంగా పెద్ద రైతులు పెట్టుబడి సాయం కోసం వారం పది రోజులు వేచి చూడాల్సి వచ్చేది. ఈసారి ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కన పెట్టి, అర్హులైన రైతులందరికీ ఒకే విడతలో నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. అందిన సమాచారం ప్రకారం, ఈ నెల 17వ తేదీన రైతు భరోసా నిధులను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి లేదా వ్యవసాయ శాఖ మంత్రి బటన్ నొక్కి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
ఒకేసారి వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్లనుండటంతో బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి పడకుండా సాంకేతిక చర్యలు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. "రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా, ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం సకాలంలో అందాలి" అనే ఉద్దేశంతోనే ఒకే విడత పంపిణీకి మొగ్గు చూపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈసారి రైతు భరోసా నిధుల పంపిణీలో ప్రభుత్వం కొన్ని కొత్త మార్గదర్శకాలను అనుసరించే అవకాశం ఉంది. కేవలం సాగులో ఉన్న భూములకే సాయం అందించాలని, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కొండలు, గుట్టలకు ఇచ్చే సాయాన్ని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల అసలైన సాగు రైతులకు మరింత మేలు చేకూరనుంది.