Telangana: ఆర్టీసీ సిబ్బంది సమయస్ఫూర్తి, బస్సులోనే కాన్పు
బస్సులో ప్రయాణించిన ఓ గర్భిణీకి నొప్పులు వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 28 Sep 2024 4:00 PM GMTబస్సులో ప్రయాణించిన ఓ గర్భిణీకి నొప్పులు వచ్చాయి. దాంతో.. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అలాగే.. ప్రయాణికులు కూడా సాయం చేయడంతో బస్సులోనే డెలివరీ అయ్యింది. తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. ఇక ఈ సంఘటనపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులను అభినందించారు.
కోదాడ డిపోనకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు శనివారం సూర్యాపేట నుంచి కోదాడకు వెళ్తోంది. అందులో గుడిబండ గ్రామానికి చెందిన గర్భిణి అలివేలు ప్రయాణిస్తున్నారు. బస్సు మునగాల మండలం తాడ్వాయి వద్దకు రాగానే ఒక్కసారిగా ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. కండక్టర్ వి.నరేశ్ బాబు అప్రమత్తమై.. డ్రైవర్ నరేశ్‌కు చెప్పి బస్సును ఆపించారు. వెంటనే అంబులెన్స్ కోసం 108 కాల్ చేశారు. నొప్పులు ఎక్కువ కావడంతో బస్సులోని తోటి మహిళా ప్రయాణికులు ఆమెకు పురుడుపోశారు. మహిళకు ఆడ శిశువు జన్మించింది. వారిని అంబులెన్స్ సాయంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
బస్సులో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్బిణికి కాన్పు చేసిన మహిళా ప్రయాణికులకు, సమయస్పూర్తితో వ్యవహారించిన ఆర్టీసీ సిబ్బందికి తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అభినందనలు తెలియజేశారు. వారు అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారని ఆయన అన్నారు.
ఆర్టీసీ బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మానవత్వం!
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) September 28, 2024
బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు సకాలంలో కాన్పు చేయించి #TGSRTC సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు.
కోదాడ డిపోనకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు శనివారం సూర్యాపేట నుంచి కోదాడకు వెళ్తోంది.… pic.twitter.com/h6vMo0Xp3j