సంక్రాంతి వేళ టీఎస్ ఆర్టీసీకి రికార్డు ఆదాయం
ఈ నెల 13న ఆర్టీసీ బస్సుల్లో 52.78 లక్షల మంది ప్రయాణించారనీ అధికారులు తెలిపారు.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 11:13 AM ISTసంక్రాంతి వేళ టీఎస్ ఆర్టీసీకి రికార్డు ఆదాయం
సంక్రాంతి పండగ వేళ అన్ని సంస్థలు.. విద్యాలయాలకు సెలవులు ఉన్న విషయం తెలిసిందే. దాంతో ప్రజలంతా పండగను ఘనంగా జరుపుకొనేందుకు సొంతూళ్లకు ఇప్పటికే వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగ పూట ఆర్టీసీ బస్సుల్లో భారీ సంఖ్యలో ప్రయాణాలు చేశారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటన చేసింది. పండుగ సందర్భంగా ఆర్టీసీ 6261 ప్రత్యేక బస్సులను నడిపిందనీ.. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
కాగా.. ఈ నెల 13న ఆర్టీసీ బస్సుల్లో 52.78 లక్షల మంది ప్రయాణించారనీ అధికారులు తెలిపారు. తద్వారా సంస్థకు రూ.12 కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఇదే రికార్డు స్థాయి ఆదాయం అని చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. దాంతో.. ప్రయాణికులు కూడా భారీగా పెరిగిపోయారు. మహాలక్ష్మి పథకం తెచ్చాక ఇంత పెద్దమొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి అని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఈ నెల 13న ఒక్కరోజే 1861 ప్రత్యేక బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెఇపారు. ఇందులో 1127 హైదరాబాద్ సిటీ బస్సులను సైతం ప్రయాణికుల కోసం వినియోగించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4,400 ప్రత్యేక బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 6,261 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం మూడు రోజుల్లోనే కోటి 50 లక్షల పైచిలుకు ప్రయాణికులను సురక్షితంగా ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చినట్లు అధికారులు చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాన్ని ఈ మూడ్రోజుల్లో 75 లక్షల మంది వరకు వినియోగించుకున్నట్లో ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్న మహిళలు 10 కోట్లకు చేరుకున్నట్లు అధికారులు చెప్పారు.