అందుబాటులోకి TSRTC 'టి9-30 టికెట్'.. ప్రయాణికుల సంతృప్తి

ప్రయాణికులు రూ.50 టికెట్‌ను కొనుగోలు చేస్తే 30 కిలోమీటర్ల పరిధిలో వచ్చేపోయే వెసులుబాటు ఉంటుంది.

By Srikanth Gundamalla  Published on  27 July 2023 7:07 AM GMT
Telangana, RTC Offer, Palle Velugu, T9-30 Tickets,

అందుబాటులోకి TSRTC 'టి9-30 టికెట్'.. ప్రయాణికుల సంతృప్తి  

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివిధ ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికే టికెట్లను వివిధ ఆఫర్లతో అందిస్తోంది. ప్రయాణికులపై మరింత భారం పడకుండా తగ్గించేందుకు పల్లె వెలుగు బస్సుల్లో 'టి9-30 టికెట్'ను తీసుకొచ్చింది. ఇప్పటికే T9-60 టికెట్‌ అందుబాటులో ఉండగా.. మరో ఆఫర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చి ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.

'టి9-30 టికెట్' ప్రకారం.. ప్రయాణికులు రూ.50 టికెట్‌ను కొనుగోలు చేస్తే 30 కిలోమీటర్ల పరిధిలో వచ్చేపోయే వెసులుబాటు ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని అధికారులు చెబుతున్నారు. పల్లెవెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద ఈ టికెట్‌ అందుబాటులో ఉండనుంది. తక్కువ దూరం ప్రయాణించే ఉద్యోగులతో పాటు కార్మికులు, ఇతర ప్రయాణికులకు సైతం ఈ టికెట్‌ ఉపయోగపడుతుంది. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలు వెళ్లి వచ్చేందుకు సైతం టికెట్‌ వర్తిస్తుందని తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. టికెట్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుందని వివరించింది.

ఈ ఆఫర్ ఉదయం నుంచే అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయంపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంచి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. రానుపోను ఒకేసారి టికెట్‌ తీసుకునే అవకాశం దొరికిందని అంటున్నారు. దాంతో.. 30 కిలోమీటర్ల పరిధిలో రూ.50 టికెట్ తీసుకుని రానుపోనూ ప్రయాణిస్తున్నామని తెలిపారు. మామూలుగా అయితే రానుపోను రూ.60 అవుతుంది... కానీ ఈ 'టి9-30 టికెట్' సదుపాయం వల్ల ప్రతిసారి రూ.10 ఆదా అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురిక్షతం అని.. అంతేకాక డబ్బులు కూడా ఆదా అవుతున్నాయని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. కాబట్టి ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఈ సదుపాయాలను ఉపయోగించుకోవాలని కోరుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీ సంస్థను ప్రోత్సహించినట్లు కూడా అవుతుందని అధికారులు చెబుతున్నారు.

Next Story