తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. త్వరలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 9:21 AM ISTతెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. త్వరలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. దాంతో.. తెలంగాణ ప్రభుత్వం రద్దీ ఎక్కువగా ఉండి... డిమాండ్ చేస్తున్న కొన్ని ప్రాంతాలకు కొత్త సర్వీసులను వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ తమ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తొలిదశలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను కరీంనగర్-హైదరాబాద్, నిజామాబాద్-హైదరాబాద్ రూట్లలో తిప్పాలని ఆర్టీసీ యాజమాన్యం ఆలోచిస్తోంది. ఈ బస్సులకు ఈ-సూపర్ లగ్జరీ బస్సులకు పేరు పెట్టారు. నిజామాబాద్-2 డిపోకు 13, కరీంనగర్-2 డిపోకు 35 బస్సులు ఇప్పటికే చేరుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. . ప్రస్తుతం ప్రైవేటు సంస్థల నుంచి ఎలక్ట్రిక్ బస్సుల్ని ఆర్టీసీ యాజమాన్యం అద్దె పద్ధతిలో తీసుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో నగరంలో సిటీ బస్సులుగా, హైదరాబాద్-విజయవాడ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులుగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తోంది. వీటిల్లో ఏసీ, నాన్ ఏసీ మెట్రో డీలక్స్ బస్సులున్నాయి.
తెలంగాణ ఆర్టీసీలో సూపర్ లగ్జరీలో ఎలక్ట్రిక్ బస్సులు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. త్వరలోనే ఈ బస్సులను ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెప్పాయి. మామూలుగా అయితే కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త బస్సులను తీసుకు రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దాంతో.. డీజిల్ బస్సులు కాకుండా.. ఎలక్ట్రిక్ బస్సులకు సంస్థ ప్రాధాన్యమిస్తోంది. వీటిల్లో డ్రైవర్లుగా బస్సు తయారీ సంస్థ సిబ్బందే ఉండనున్నారు. కండక్టర్లు మాత్రం ఆర్టీసీ నుంచి ఉంటారు. ఈ బస్సులకు కిలోమీటర్ల వారీగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది.