ఆ చిన్నారికి లైఫ్‌టైమ్ ఫ్రీ బస్‌పాస్‌: సజ్జనార్

రాఖీ పౌర్ణమి రోజు ఆర్టీసీ బస్సులో ఒక మహిళకు డెలివరీ అయిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  20 Aug 2024 2:37 PM GMT
Telangana, rtc, child,    life time free bus pass ,

 ఆ చిన్నారికి లైఫ్‌టైమ్ ఫ్రీ బస్‌పాస్‌: సజ్జనార్ 

రాఖీ పౌర్ణమి రోజు ఆర్టీసీ బస్సులో ఒక మహిళకు డెలివరీ అయిన విషయం తెలిసిందే. గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పుట్టిన చిన్నారికి లైఫ్‌ టైమ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్‌ పాస్‌ను కల్పిస్తున్నట్లు టీజీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్‌స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవితకాలం ఉచిత బస్‌పాస్‌ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఆ చిన్నారికి పుట్టినరోజు కానుకగా ఉచిత బస్‌పాస్‌ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ప్రసవం చేసిన స్టాఫ్ నర్స్‌ అలివేలు మంగమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏడాది పాటు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

కాగా.. రాఖీ పండుగ రోజున బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో గర్భిణికి పురిటిని నొప్పులు వచ్చాయి. దాంతో.. వెంటనే స్పందించిన కండక్టర్ భారతి, డ్రైవర్ అంజిలతో పాటు నర్సు అలివేలు మంగమ్మ మానవత్వం చాటుకున్నారు. అంబులెన్స్ వచ్చే లోపే మహిళకు ప్రసవం చేశారు. తల్లీ బిడ్డను సురక్షితంగా కాపాడారు. కాగా.. వీరి ముగ్గురికీ హైదరాబాద్ బస్‌ భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. వారిని ఘనంగా సన్మానించారు. అలాగే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నగదు, బహుమతులు అందించారు. జోగులాంబ గద్వాల జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిన గర్భిణి సంధ్య సోమవారం బస్సులో గద్వాల నుంచి వనపర్తి ఆసుపత్రికి కాన్పు కోసం బయల్దేరిన ఈ సంఘటన జరిగింది.



Next Story