ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఇవి తెలుసుకోండి..!

తెలంగాణలో మహిళలు ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

By Srikanth Gundamalla  Published on  9 Dec 2023 8:16 AM IST
telangana, rtc,  free journey, woman ,

ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఇవి తెలుసుకోండి..!

తెలంగాణలో మహిళలు ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల్లో భాగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌ చెప్పింది మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని. ఈ మేరకు తొలి కేబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న తెలంగాణ మహిళలు అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయంపై మహిళా లోకం సంతోషం వ్యక్తం చేస్తోంది.

మహాలక్ష్మి పథకంలో భాగా తెలంగాణ ఆర్టీసీలోని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలాగే సిటీలోని ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ చేయవచ్చు. డిసెంబర్‌ 9వ తేదీన సోనియాగాంధీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రంలోని మహిళలు ఈ కేటగిరి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

తెలంగాణలో స్థానికత ఉండి తెలంగాణలో తిరిగే బస్సులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఉచిత ప్రయాణం కోసం మహిళలు ఆధార్‌ సహా ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉన్న ఏదైనా కార్డు చూపించవచ్చు. మొదటివారం రోజులు ఆర్టీసీ బస్సుల్లో ఏవీ లేకుండానే ఫ్రీ జర్నీ కల్పిస్తున్నారు. తర్వాత అర్హులైనవారందరికీ ఉచిత బస్సు ప్రయాణం కోసం మహాలక్ష్మి కార్డులు అందజేస్తారు. ఆ కార్డు చూపిస్తే బస్సులో కండక్టర్‌ జీరో టికెట్ జారీ చేస్తారు. దీని వల్ల రోజూ ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారనేది లెక్కల్లో ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఖర్చులను ఆర్టీసీ సంస్థకు చెల్లించనుంది.

ఇక తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటిన బస్సులకు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ బార్డర్‌ దాటిన తర్వాత ఎంత టికెట్ అయితే అంత డబ్బులు చెల్లించాలి. మహిళలతో పాటు ట్రాన్స్‌ జెండర్స్‌కు కూడా ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పథకం వల్ల ఆర్టీసీకి 3వేల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లబోతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అలాగే బస్సుల్లో ప్రయాణం చేసే మహిళల సంఖ్య కూడా పెరగనుందని అంచనా వేస్తున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మార్గదర్శకాలు:

బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్స్ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం వర్తింపు.

తెలంగాణ వ్యాప్తంగా మినీ పల్లెవెలుగు, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచితం ప్రయాణం

తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులలో అయితే రాష్ట్ర సరిహద్దు వరకు ఉచితం, బార్డర్ నుంచి డెస్టినేషన్ వరకు మాత్రమే టికెట్ ఖర్చులు

తెలంగాణ పరిధి వరకు కిలోమీటర్ల విషయంలో ఎలాంటి పరిమితుల్లేవు

మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్స్‌కు కూడా ఉచిత ప్రయాణం

హైదరాబాద్ లో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం

స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి

ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేయనున్న ఆర్టీసీ

Next Story