భక్తుల ఇంటికే భద్రాద్రి సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు.. ఎలాగంటే..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Srikanth Gundamalla Published on 1 April 2024 6:22 PM ISTభక్తుల ఇంటికే భద్రాద్రి సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు.. ఎలాగంటే..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మేడారం జాతర అమ్మవార్ల ప్రసాదాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చింది ఆర్టీసీ. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలు జరుగుతాయి. అయితే.. భద్రాద్రి నుంచి తలంబ్రాలను చాలా మంది కావాలని కోరుకుంటారు. అలాంటి భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని నిర్ణయం తీసుకుంది టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములో కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకు చేర్చనుంది.
ఈ పవిత్ర కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను ఆవిష్కరణ తర్వాత.. తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు. అయితే.. రాములోరి తలంబ్రాలను కావాలనుకునే భక్తులు.. టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సీతారాముల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేయనుంది.
భద్రాద్రిలో రాములోరి కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉందనీ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. వీటిని భక్తులు తమ ఇంట్లో ఉంచుకోవాలని అనుకుంటారని చెప్పారు. ఈ క్రమంలోనే భక్తుల ఇంటికే తలంబ్రాలను చేర్చాలని రెండేళ్ల క్రితమే టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇక ఆర్టీసీ ప్రయత్నానికి భక్తుల నుంచి కూడా మంచి స్పందన వచ్చిందని సజ్జనార్ చెప్పారు. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారని అన్నారు. 2022లో 89వేల మంది భక్తులు తలంబ్రాలను బుక్ చేయగా.. 2023లో ఏకంగా 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను డెలివరీ చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూచించారు.