తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు నమోదైన కేసులలో స్వల్పస్థాయిలో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 82,270 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,061 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,19,966కి చేరింది.
నిన్న ఒక్క రోజే 56 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మరణించిన వారి సంఖ్య 2,150కి చేరింది. నిన్న 5,093 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 72,133 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,508 కేసులు ఉన్నాయి. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 673, రంగారెడ్డిలో 514, సంగారెడ్డి జిల్లాలో 373, మహబూబ్‌నగర్ జిల్లాలో 328 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.