తెలంగాణలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 77,091 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 7,646 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. నిన్న ఒక్క రోజే 53 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,261 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిన్న 5,926 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,55,618కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,727 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,441 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 631, రంగారెడ్డిలో 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్‌లో 330, నల్గొండలో 285, సిద్దిపేటలో 289, సూర్యాపేటలో 283, మహబూబ్‌నగర్‌లో 243, జగిత్యాలలో 230 కేసులు రికార్డయ్యాయి.
నైట్ కర్ఫ్యూ పొడిగింపు..!
రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఇది నేటితో(శుక్రవారం)తో ముగియనుంది. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరుగుతుందన మరికొన్ని రోజులు కర్ఫ్యూని కొనసాగించాలనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. బుధవారం హోంమంత్రి మహమూద్ అలీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో పరిస్థితులను తెలుసుకున్నారు. వీటిన్నంటినీ పరిశీలించిన సీఎం కేసీఆర్ కర్ఫ్యూ పొడిగింపునకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీనిపై శుక్రవారం నిర్ణయం ప్రకటించనున్నారు.