Telangana: రేషన్ కార్డుల రూపం మారనుందా..?
ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల రూపం మారనుందని తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 22 May 2024 10:39 AM ISTTelangana: రేషన్ కార్డుల రూపం మారనుందా..?
తెలంగాణలో రేషన్ కార్డులు లేనివారి సంఖ్య పెరిగింది. ఇలాంటి వారు రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుందని అందరూ భావించారు. అధికారులు కూడా అదిగో చేస్తున్నాం.. ఇదిగో చేస్తున్నామని పలుమార్లు చెప్పారు. ఇక ఇంతలోనే లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక తాజాగా రేషన్‌కార్డులకు సంబంధించిన మరోవార్త వినిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల రూపం మారనుందని తెలుస్తోంది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం రేషన్ కార్డుల రూపం మార్చే ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ కార్డులతో గతంలో ఉన్న రూ.5లక్షల చికిత్స పరిమితిని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రూ.10లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కూడా కొత్తవి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 89,98,546 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక మరికొందరు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల రూపం మారుస్తున్న క్రమంలో కొత్తవి కూడా జారీ చేస్తారని తెలుస్తోంది. మరి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత దీనిపై క్లారిటీ రానుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ఒక నిర్ణయం తీసుకోనుంది.
కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్‌కార్డు ఒక చిన్న పుస్తకం లాగా ఉండేది. అందులో కుటుంబ యజమాని ఫొటోతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు, వయసు వివరాలు ఉండేవి. ఆ తర్వాత రేషన్‌కార్డు రూపం మారింది. రైతుబంధు పాస్‌బుక్ సైజులో రేషన్ కార్డులు ఉండేవి. ముందువైపు కుటుంబ సభ్యుల గ్రూప్ ఫొటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి. వెనుక వైపు చిరునామా, ఇతర వివరాలు ఉండేటివి. ఆ తర్వాత రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఒక పేజీతో ఒకవైపే ఉండే ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫొటోలు లేకుండా.. కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్ దుకాణం, కార్డు సంఖ్య మాత్రమే ఉన్నాయి. ఇక తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల రూపం మారిస్తే అవి ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.