Telangana: అకాల వర్షాలు.. పంట నష్టం రిపోర్ట్ కోరిన మంత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనూహ్య వర్షాలు, వడగళ్ల వాన కురిసిన నేపథ్యంలో వ్యవసాయ నష్టం నివేదికలు అందజేయాలని
By అంజి Published on 19 March 2023 12:16 PM ISTఅకాల వర్షాలు.. పంట నష్టం రిపోర్ట్ కోరిన మంత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనూహ్య వర్షాలు, వడగళ్ల వాన కురిసిన నేపథ్యంలో వ్యవసాయ నష్టం నివేదికలు అందజేయాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి ఫోన్ చేసి పంట నష్టం నివేదిక ఇవ్వాలని కేటీఆర్ కోరారు. వ్యవసాయ శాఖ సిబ్బంది దెబ్బతిన్న పొలాలను పరిశీలించి, ఎంతమేర నష్టం జరిగిందో, వర్షాలు, వడగళ్ల వానలకు ఏ రకమైన పంటలు దెబ్బతిన్నాయి, పంటలు నష్టపోయిన రైతుల సంఖ్య వివరాలతో నివేదిక రాయాలని మంత్రి ఆదేశించారు.
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానతో అకాల వర్షాల కారణంగా 20,000 ఎకరాలకు పైగా భూమిలో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణలో గురు, శుక్రవారాల్లో కురిసిన వడగళ్ల వానకు మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొప్పాయి, మామిడి తదితర పంటలు చాలా వరకు పూలు, పక్వానికి వచ్చే దశలో నేల రాలాయి. వ్యవసాయ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్క ఖమ్మం జిల్లాలోనే దాదాపు 1930 మంది రైతులు సాగు చేసిన 18,826 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నది.
10 లక్షల విలువైన బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయని, మిర్చి, వరి రైతులు కూడా నష్టపోయారని కొత్తగూడెం జిల్లా ఉద్యానవన అధికారి జె మరియన్న తెలిపారు. పై వాటికి తోడు గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో మామిడి చెట్లు నేలకొరిగాయి. ఏది ఏమైనప్పటికీ కరీంనగర్ జిల్లాలో నష్టం చాలా తక్కువగా ఉంది. మొక్కజొన్న, వరి చాలా చోట్ల నెలకొరిగింది. కోహీర్ మండలంలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని ఉద్యానవన అధికారి సునీత తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో నష్టపోయిన సాగు ప్రాంతాలను వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు అధినేత రాజేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. వడగళ్ల వానలకు రైతులు నష్టపోయే ప్రమాదాన్ని నివారించేందుకు నెల రోజుల ముందుగానే రబీ పంటను పండించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని, ఈ పరిస్థితి ప్రతి మార్చి, ఏప్రిల్‌లో పునరావృతమవుతోందని మంత్రి గుర్తు చేశారు.
మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాల రైతులు తమ పంటల చక్రాన్ని నెల రోజుల వ్యవధిలో ముందుకు తీసుకెళ్లాలని శాస్త్రవేత్తల సలహాలను పాటిస్తున్నారని, అన్ని వర్క్‌షాప్‌లలో రైతులకు వ్యవసాయ అధికారులు ఇదే విషయాన్ని తెలియజేశారని చెప్పారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట, మర్పల్లి మండలాల పరిధిలోని 13 గ్రామాల్లో వడగళ్ల వానతో క్యాబేజీ, ఉల్లి, మొక్కజొన్న, పుచ్చకాయ, క్యాప్సికం పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయని మంత్రి తెలిపారు.