మహబూబాబాద్‌లో వర్షానికి రైల్వే ట్రాక్ ధ్వంసం.. నిలిచిపోయిన రైళ్లు (వీడియో)
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. వరదలు పోటెత్తుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 8:53 AM IST
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. వరదలు పోటెత్తుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని చోట్ల అయితే ఏకంగా వరద నీటి ప్రభావానికి రహదారులు కొట్టుకుపోతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల్లోని జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. తాజాగా మహబూబాబాద్‌లో భారీ వర్షాలకు అయోధ్య గ్రామంలోని చెరువుకట్ట తెగింది. చెరువు నుంచి వరద నీరు ఉప్పొంగి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తోంది.
ఈ వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో.. విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్ పడింది. ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ఈ వరదకు ధ్వంసం అయ్యింది. ట్రాక్ పై ఉండాల్సిన కంకర మొత్తం వరదలో కొట్టుకుపోయింది.దాంతో.. ట్రాక్ కిందనుంచి వర్షం నీరు ప్రవహిస్తోంది. ట్రాక్ ధ్వంసం అయ్యింది. ఈ విషయాన్ని గమనించిన రైల్వే అధికారులు పలు రైళ్లను నిలిపివేశారు. మచిలీపట్నం, సింహపురి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పటికే నిలిచిపోయాయి. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లోనే ఈ రైళ్లను నిలిపివేశారు. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్‌కు వరద నీరు తాకింది. దాంతో.. పందిళ్లపల్లి వద్ద నాలుగు గంటల పాటు మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. దాంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాక్‌కింద నుంచి నీరు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని సరిచేసేందుకు సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.వరద ప్రభావం తగ్గిన తర్వాతే పునరుద్ధరణ పనులు చేయగలమని చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఈ మార్గంలో వెళ్లాల్సిన రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. రైలుపట్టాలపై కంకర కొట్టుకుపోయింది. పట్టాల కింద నుంచి భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. మచిలీపట్నం, సింహపురి ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. pic.twitter.com/qYz2tipg8t
— Newsmeter Telugu (@NewsmeterTelugu) September 1, 2024