వర్షాల నేపథ్యంలో అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక సూచనలు
తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరద పోటెత్తుతోంది.
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 9:30 AM ISTవర్షాల నేపథ్యంలో అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక సూచనలు
తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరద పోటెత్తుతోంది. చెరువులు, రిజర్వాయర్లకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వాతావరణ శాఖ హెచ్చిరకల నేపత్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ భద్రతా చర్యల్లో పాల్గొనాలని చెప్పారు. ఇక రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులను పర్యవేక్షించడానికి ఇంజనీర్ల బృందం సిద్ధంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. నీటి పారుదల ఇంజినీర్ల విభాగం వారివారి నిర్దేశిత ప్రాంతంలో అందుబాటులో ఉండాలన్నారు. ఇక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే సంబంధి విభాగాలను తక్షణమే అలర్ట్ చేసి సాయం అందేలా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
భారీ వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం పాల్గొన్నారు. అధికారులకు సీఎస్, మంత్రి పలు సూచనలు చేశారు. జిల్లా, మండల స్థాయి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని.. ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని చెప్పారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని సీఎస్ అన్నారు. ఆయా చెరువులకు గండ్లు పడడం, తెగిపోవడం వంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వర్షాలు, వరద ప్రాభావిత ప్రాంతాల్లో స్థానిక అగ్నిమాపక, పోలీసు బృందాలను మోహరించాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు.