Telangana Polls: డబ్బు, ఉచితాల పంపిణీకి చెక్ పెట్టేందుకు.. సివిల్‌ డ్రెస్సుల్లో పోలీసుల నిఘా

పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ఇంకా గంటలే మిగిలి ఉండగా.. అభ్యర్థులు అక్రమంగా పంపిణీ చేస్తున్న డబ్బు, ఉచిత పంపిణీకి చెక్ పెట్టేందుకు పోలీసులు దృష్టి సారించారు.

By అంజి
Published on : 29 Nov 2023 7:00 AM IST

Telangana Polls, Police surveillance , civil dresses, money distribution, freebies

Telangana Polls: డబ్బు, ఉచితాల పంపిణీకి చెక్ పెట్టేందుకు.. సివిల్‌ డ్రెస్సుల్లో పోలీసుల నిఘా

హైదరాబాద్: పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ఇంకా గంటలే మిగిలి ఉండగా.. అభ్యర్థులు అక్రమంగా పంపిణీ చేస్తున్న డబ్బు, ఉచిత పంపిణీకి చెక్ పెట్టేందుకు పోలీసులు దృష్టి సారించారు. పోలింగ్ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఎవరైనా అక్రమంగా నగదును తరలిస్తే వారిని పట్టుకునేందుకు పోలీసులు సాధారణ దుస్తులు ధరించి స్థానికుల్లా తిరుగుతున్నారు.

గట్టి పోటీ ఉండే నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బు పంపిణీపై అభ్యర్థులు, పార్టీల మధ్య వాగ్వాదం జరుగుతున్నాయి. మేడ్చల్ నియోజకవర్గం వద్ద బ్యాగులో నగదును తీసుకెళ్తున్న మహిళను స్థానిక కాంగ్రెస్ నాయకులు పట్టుకుని స్థానికులకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఇదే తరహాలో బోరబండలో ఓ వ్యక్తి నగదు తీసుకెళ్తుండగా స్థానికులు పట్టుకున్నారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, నాంపల్లి, మలక్‌పేట్, యాకుత్‌పురా, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నియోజకవర్గాల్లో గట్టి పోటీ నెలకొనడంతో ఇక్కడ నగదు, ఇతర సరుకులు పంపిణీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగదు లేదా ఇతర ఉచితా పంపిణీ గురించి ప్రజలకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇన్‌ఫార్మర్‌ల గుర్తింపును గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. నవంబర్ 30వ తేదీ గురువారం జరగనున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు రాజకీయ పార్టీలు, వ్యక్తులు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య హెచ్చరించారు.

సందీప్ శాండిల్య మాట్లాడుతూ హోంగార్డు నుంచి అత్యున్నత స్థాయి అధికారి వరకు ప్రతి పోలీసు విధులు నిర్వహిస్తారని, ఎలాంటి అవాంతరాలు, చట్ట ఉల్లంఘనలు జరగకుండా ఉండాలన్నారు. “ఎవరైనా ఇబ్బంది సృష్టించడానికి ప్రయత్నిస్తే, పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరిస్తారు. రాజకీయ పార్టీలకు ఏదైనా ఫిర్యాదు ఉంటే మాకు తెలియజేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేము వారి ఫిర్యాదును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం”అని ఆయన అన్నారు.

Next Story