Telangana Polls: బర్రెలక్క ఓ సంచలనం
కొల్హాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజిల్ గుర్తుపై పోటీ చేస్తున్న శిరీష అలియాస్ బర్రెలక్క పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది.
By అంజి Published on 23 Nov 2023 10:36 AM ISTTelangana Polls: బర్రెలక్క ఓ సంచలనం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం ( ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా)లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజిల్ గుర్తుపై పోటీ చేస్తున్న కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది. తండ్రిని కోల్పోయిన శిరీష డిగ్రీ చదివింది. తల్లి, తమ్ముడితో కలిసి దుర్భరమైన జీవనం సాగిస్తున్న శిరీష కుటుంబం ఎస్సీ సంఘీయులు. డిగ్రీ చదివిన శిరీష స్థానిక ఎమ్మెల్యేను కలవడానికి వెళ్తే సదరు ఎమ్మెల్యే నిరాకరించారు. డిగ్రీ చదినా కేసీఆర్ సర్కారులో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లు రావడం లేదని శిరీష మూడు బర్రెలు కొనుగోలు చేసింది.
ఉద్యోగాలు రావడం లేదని అందుకే తాను బర్రెలు మేపడానికి వచ్చానంటూ వీడియో లు చేస్తూ సోషల్ మీడియా లో బర్రెలక్క గా పాపులర్ అయింది శిరీష. సమాజాన్ని వ్యవస్థ ఎంత నిర్లక్ష్యం చేస్తుందో, దాని వల్ల తలెత్తే రుగ్మతలు తెలియజేసే విధంగా 25 ఏళ్ల వయస్సు ఉన్న శిరీష అలియాస్ బర్రెలక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క బాగా ఫేమస్ అయ్యారు. ఎందరో ప్రముఖులు బర్రెలక్క కు ఆశీస్సులు అందజేస్తున్నారు.
బర్రెలక్క విజిల్ మోత ఒక్క కొల్హాపూర్ నియోజకవర్గానికే పరిమితం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మార్మోగుతోంది. వెన్నుముక లేని రాజకీయ నాయకులు చేయలేని విధంగా అహంకారం, అధర్మం, అన్యాయం, అధికార మదం, నిర్లక్ష్యం, భాధ్యాతారాహిత్యం.. తదితర సమాజానికి రాచపుండు లా దాపురించిన శక్తులపై శిరీష అలియాస్ బర్రెలక్క రూపంలో సమాజంలో జనిస్తున్న తిరుగుబాటు. ఇంతటి పాపులర్ అయిన బర్రెలక్కను ప్రధాన పేపర్, టీవీ మీడియాలు విస్మరించాయి. అయినప్పటికీ సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ తదితర వేదికల్లో బర్రెలక్కకు యువతీ యువకులు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు.
శిరీష అలియాస్ బర్రెలక్క మేనిఫెస్టో కూడా ప్రకటించారు.
బర్రెలక్క మేనిఫెస్టో
1 . నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా.. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా నిలదీస్తా
2. పేదలకి ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా
3. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తా
4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు
5. ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడుతా
6. నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు - ఫ్రీ కోచింగ్
7. యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్
ఎన్నికల రణరంగంలో శిరీష దూకుడు ధాటికి కొల్హాపూర్ లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు వణికిపోతున్నారు. శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల్లో పోటీ, ఆమె ఎన్నికల ప్రసంగాలు, ఆమె పోటీ పై ప్రముఖులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. ధైర్యం, తెగువ, సత్తా, ఆత్మాభిమానం, సామాజిక చైతన్యం.. వీటన్నింటికీ ప్రతిరూపంగా తనను తాను మలుచుకున్న శిరీష అలియాస్ బర్రెలక్క ప్రజలకు గొప్ప సందేశం చెప్పగలిగింది. అధికార మదంతో కళ్లు నెత్తి కి ఎక్కి విర్రవీగే రాజకీయ నాయకులకు హెచ్చరిక సందేశం పంపింది శిరీష అలియాస్ బర్రెలక్క.