జయశంకర్‌ భూపాలపల్లిలో గెలిచేదెవరు?.. ఓడేదెవరు?.. పబ్లిక్‌ టాక్‌ ఇదే

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున గండ్ర వెంకట రమణారెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది.

By అంజి  Published on  13 Nov 2023 11:14 AM IST
జయశంకర్‌ భూపాలపల్లిలో గెలిచేదెవరు?.. ఓడేదెవరు?.. పబ్లిక్‌ టాక్‌ ఇదే

భూపాలపల్లి నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. రుణమాఫీ కాలేదని రైతులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు లేవని పేదలు, దళిత బంధు పథకం సరిగ్గా అమలు చేయట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తాము కూడా రైతులమేనని, తమకు రైతుబంధు ఇవ్వాలని కౌలు రైతులు అంటున్నారు. ఇక అనేక గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. గ్రామాల్లో కనీస మౌళిక సదుపాయాలు కరువయ్యానని ప్రజలు చెబుతున్నారు. తమ సమస్యలు తీర్చేవారికే ఈ సారి ఓటు వేయబోతున్నామని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున గండ్ర వెంకట రమణారెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున చందుపట్ల కీర్తిరెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుండి గండ్ర సతయనారాయణ రావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది.

నియోజకవర్గ నేపథ్యం

2009లో నియోజకవర్గ పునర్‌ విభజనలో భాగంగా శాయంపేట నియోజకవర్గం రద్దు కావడంతో జయశంకర్‌ భూపాలపల్లి నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలు ఉన్నాయి. అవి భూపాలపల్లి, మొగుళ్లపల్లి, చిట్యాల, ఘన్‌పూర్‌, రేగొండ, శాయంపేట, కొత్తపల్లిగోరి, టేకుమట్ల. ఇది వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఇది జనరల్‌ నియోజకవర్గం. ఇక్కడ మొత్తం 2,63,452 మంది ఓటర్లు ఉన్నారు. పట్టణ ఓటర్లు 13 శాతం ఉండగా, గ్రామీణ ఓటర్లు 87 శాతం ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 50.40 శాతం ఉండగా, స్త్రీ ఓటర్లు 49.60 శాతం ఉన్నారు. ఓబీసీ ఓటు శాతం 74.70 శాతం ఉండగా, ఎస్సీలు 20.30 శాతం, ఎస్టీలు 5 శాతం ఉన్నారు. హిందువులు 96.70 శాతం ఉండగా, ముస్లింలు 2.60 శాతం, ఇతరులు 0.7 శాతం మంది ఉన్నారు. కాగా భూపాలపల్లి రూరల్ నియోజకవర్గం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు జిల్లా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ప్రాంతం సింగరేణి కాలిరీస్, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్, కొన్ని చిన్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వంటి పరిశ్రమలకు నిలయం.

- కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్

గండ్ర వెంకట రమణారెడ్డి - బీఆర్‌ఎస్‌

గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారిపై 7,216 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అత్యధికంగా 69,918 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత వెంకట రమణారెడ్డి కాంగ్రెస్‌ను వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరారు. గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి గండ్ర జ్యోతి 2019లో వరంగల్‌ గ్రామీణ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆమె కూడా బీఆర్‌ఎస్‌ నాయకురాలే.

గండ్ర సత్యనారాయణ రావు - కాంగ్రెస్‌

2018 తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు 2023లో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. 2009 ఎన్నికలలో టీడీపీ, టీఆర్‌ఎస్‌ కూటమిలో భాగంగా భూపాలపల్లిని టీఆర్ఎస్‌కు కేటాయించారు. అప్పుడు గండ్ర సత్యనారాయణ టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. 2014లో టీడీపీ, బీజేపీల మధ్య పొత్తులో భాగంగా భూపాలపల్లిని బీజేపీకి కేటాయించారు. గండ్ర సత్యనారాయణ టీడీపీ నుండి వచ్చినప్పటికీ, రెండు పార్టీలు గండ్ర సత్యనారాయణను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అంగీకరించాయి. అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2017 నవంబర్‌ 16వ తేదీన టీడీపీని వీడి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ఆయనకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ వస్తుందని హామీ ఇచ్చారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ పార్టీ సిరికొండ మధుసూదనాచారిని అభ్యర్థిగా విడుదల చేయడంతో, గండ్ర టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2021లో భూపాలపల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో గండ్ర సత్యనారాయణరావు తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

చందుపట్ల కీర్తిరెడ్డి - బీజేపీ

చందుపట్ల కీర్తిరెడ్డి (బీజేపీ) చందుపట్ల కీర్తిరెడ్డి (43) 2014లో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి 2018లో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరపున భూపాలపల్లిలో పోటీ చేశారు. కీర్తి రెడ్డికి ఇతర అభ్యర్థుల కంటే ఎప్పుడూ ప్రయోజనం ఉంటుంది, ఎందుకంటే ఆమె బిజెపి సీనియర్ నాయకుడు సిహెచ్‌ జంగారెడ్డికి కోడలు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దిగ్గజం, మాజీ ప్రధాని పీవీ నరసింహారావును ఓడించి రాజకీయ అలజడి సృష్టించిన ఏకైక బీజేపీ నేత చందుపట్ల జంగా రెడ్డి. కీర్తిరెడ్డి ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నారు. ఆమె మహబూబ్‌నగర్ జిల్లాకు చెందివారు. కీర్తి మాట్లాడే యాస జనాలకు బాగా నచ్చుతుంది. ఆమె తన ప్రసంగాల సమయంలో ఉపయోగించిన కథలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి.

2009లో ఏర్పాటైన ఈ అసెంబ్లీ నియోజకవర్గం ప్రారంభం నుంచి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ పోరు సాగుతోంది. కాంగ్రెస్‌ 2009, 2018 ఎన్నికలలో రెండుసార్లు ఈ నియోజకవర్గాన్ని గెలుచుకుంది.

ప్రస్తుత ఎమ్మెల్యే

మే 5, 1965లో జన్మించిన వెంకట రమణా రెడ్డి పాలిటెక్నిక్‌లో చదివి ఆ తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించి విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. అతను ప్రముఖ రాజకీయ నాయకురాలు జ్యోతిని వివాహం చేసుకున్నాడు. ఆయన సోదరుడు గండ్ర భూపాల్ రెడ్డి కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 2009లో ఐఎన్‌సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, 2012లో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా నియమితులయ్యారు. వెంకట రమణారెడ్డి వృత్తి వ్యాపారం, అలాగే స్టోన్‌ క్రషర్లు నడిపిస్తుంటారు. అతనిపై ప్రస్తుతం నాలుగు పెండింగ్ కేసులు ఉన్నాయి.

2014లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై అధికార వ్యతిరేకత, తెలంగాణ ఆందోళన కారణంగా బీఆర్‌ఎస్ అభ్యర్థి సిరికొండ మధుసూధనాచారి పట్ల సానుభూతి కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. కొండా సురేఖ కుటుంబం ప్రభావంతో కూడా బీఆర్‌ఎస్‌కు మద్దతు లభించింది. టిడిపి-బిజెపి సంకీర్ణంలో భాగంగా, ఈ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపికి కేటాయించబడింది. అయితే క్యాడర్ లేకపోవడంతో టీడీపీ నేత గండ్ర సత్యనారాయణరావు బీజేపీ గుర్తుపై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ప్రభుత్వ అనుకూల ఓట్లను విజయవంతంగా చీల్చడంతో బీఆర్‌ఎస్ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మధుసూదనాచారి ఆరోగ్యం బాగాలేక, అభివృద్ధి పనుల్లో లేకపోవడంతో ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఆయన కుమారుడు ప్రదీప్‌పై భూకబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి, ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన ముగ్గురు కుమారులను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉంచారు, ఇది పార్టీలో అంతర్గత విభేదాలకు కారణమైంది. గండ్ర వెంకటరామ రెడ్డి 33.5 శాతం ఓట్లతో గెలుపొందారు.

ప్రస్తుత పరిస్థితి స్వతంత్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ఇటీవల కాంగ్రెస్‌ లో చేరడంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బలమైన ఉనికిని కలిగి ఉంది. నియోజక వర్గంలో బీజేపీ చురుగ్గా తన ఉనికిని పెంచుకుంటోంది. చందుపట్ల కీర్తి రెడ్డి ఈ నియోజకవర్గంలో చాలా చురుకుగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి కూడా చురుగ్గా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు

కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ఊరు వాడ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్కరికి సేవ చేస్తానని ఓటర్లకు చెబుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే మేలైన పాలన అందుతుందని, అధికారంలోకి వచ్చాక ఇళ్లు లేని వారికి ఇళ్లులు, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే రాజకీయ నాయకులకు మాత్రమే ఓటు వేయాలని గండ్ర సత్యనారాయణ ప్రజలను కోరారు.

ఇటు బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తామని కీర్తిరెడ్డి ప్రజలకు హామీ ఇస్తున్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు బీఆర్‌ఎస్‌ నాయకులకే కేటాయిస్తుండటంతో నిరుపేద కుటుంబాలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. తనకు ఒక్కసారిగా ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానన్నారు. నియోజకవర్గంలో ఇంజినీరింగ్ కాలేజీ, రైల్వే లైన్‌కు కీర్తిరెడ్డి హామీ ఇచ్చారు.

ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే అయ్యాక భూపాలపల్లిని అభివృద్ధి చేశానని, ప్రజల ఇబ్బందులు, కష్టాలను చాలా వరకు తొలగించానని చెబుతున్నారు. అభివృద్ధి కొనసాగాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా మూడోసారి కేసీఆర్‌ సీఎం అయితేనే సాధ్యమన్నారు. కొందరు నాయకులు ఓట్ల కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఎవరు ఏమిటో ఆ భగవంతుడు త్వరలోనే చూస్తారని పేర్కొన్నారు. అభివృద్ధే ఆశయంగా పని చేస్తున్న తనను ఆశీర్వదించి తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించాలని గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలను కోరుతున్నారు.

నియోజకవర్గ ఓటర్లు ఏమంటున్నారంటే?

''సమాజంలో మహిళలకు సరైన గుర్తింపు దక్కడం లేదు. ఇటీవల పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించడం సంతోషమే. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మహిళలను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వడం లేదు. మహిళలకు సముచిత స్థానం కల్పించే వారికే ఓటేయాలనేది నా నిర్ణయం. వారసత్వ రాజకీయాలకు సైతం స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. నా ఓటు బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డికే'' అని గుండ్లకర్తి గ్రామానికి చెందిన యువతి భవిష్య చెప్పింది.

- తమ సమస్యలు గురించి చెబుతున్న వృద్ధులు

''ప్రభుత్వం మా రైతుల బాధలు అర్థం చేసుకోవాలి. రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు. దీంతో బ్యాంకుల్లో తీసుకున్న అప్పు రెండింతలు అయ్యింది. రుణమాఫీ వస్తుందన్న ఆశతో అప్పు కట్టలేదు. ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. నేను ఈ సారి హస్తం గుర్తుకు ఓటు వేయబోతున్నా.. ఎన్నో కలలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్‌ పాలనలో రైతులు పంటలకు మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం'' అని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజయ్య అనే రైతు చెప్పారు.

''నాకు డబుల్‌ బెడ్‌రూం వచ్చింది. నా కూతురికి పెళ్లి చేసిన సమయంలో ప్రభుత్వం కానుకగా అందించే కల్యాణలక్ష్మీ పథకం కూడా వచ్చింది. ఈ సారి నేను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే ఓటు వేసే ఆలోచనలో ఉన్నాను. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అభివృద్ధి బాగా జరిగింది. 24 గంటల కరెంట్‌తో పాటు రైతుబంధు కూడా వస్తోంది'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రైతు చెప్పారు.

- మెట్‌పల్లి, ఎల్లారెడ్డిపల్లె గ్రామాల్లో వర్షాల ధాటికి కొట్టుకుపోయిన రోడ్లు

''మా గ్రామానికి సరిగ్గా రోడ్డు లేదు. మా గ్రామానికి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మాకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వానికి తమ ఓట్లు వేస్తాం'' అని ఎల్లారెడ్డిపల్లె గ్రామ ప్రజలు చెబుతున్నారు. అలాగే పత్తి, మిరప పంటలకు వ్యవసాయ మార్కెటింగ్‌, నిల్వ సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

''దళితబంధు బీఆర్‌ఎస్‌ నాయకులకే వస్తోంది. అన్ని విధాల ఉన్న వారికే ప్రభుత్వం దళితబంధు ఇస్తోంది. ఏం లేనివారికి ఏం పథకాలు లేవు అన్నట్టుగా చూస్తోంది. నిరుపేదలకు అన్యాయం జరుగుతోంది. రైతుబంధు విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతోంది. కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకున్నా పాపానా పోలేదు. నిత్యావసరాల ధరలు కూడా ఆకాశనంటుతున్నాయి'' అని సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన చిలువేరు రమేష్‌ అన్నారు.

- కొత్తగా ఏర్పడిన గోరికొత్తపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం

నియోజకవర్గంలోని గోరికొత్తపల్లి మండలాన్ని కేంద్రంగా చేసుకుని వంద సంవత్సరాల క్రితం మహమ్మద్ ఇమామ్ గోరి కుమారుడు ఆజం గోరి, ఆయన కుమారుడు సులేమాన్ గోరి పరిపాలించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా గోరికొత్తపల్లి, కోనరావుపేట, జమ్ షెడ్ బేగ్ పేట రెవెన్యూ గ్రామాల శివారులోని కొన్ని వందల ఎకరాల భూములు ఇప్పటికి సులేమాన్ గోరి మీదనే ఉన్నాయి. ఈ భూములకు సంబంధించిన రైతులకు పట్టాలు లేకపోవడంతో కొన్నేళ్లుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులుగా మిగిలిపోయారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 46 మంది రైతులకు పట్టాలు ఇచ్చారని, ప్రభుత్వం వచ్చాక 300 మందికిపైగా రైతులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని గోరికొత్తపల్లి గ్రామ ప్రజలు చెప్పారు.

- రైతులు సాగు చేసుకుంటున్న సులేమాన్‌ గోరి దొర పేరు మీద ఉన్న భూములు

''మా మండలంలో ఎక్కువ మంది గండ్ర వెంకట రమణారెడ్డికే ఓటు వేయబోతున్నారు. గోరికొత్తపల్లి మండల ఆకాంక్షను ఆయన నెరవేర్చారు. అలాగే రైతులు ఎన్నో ఏళ్లు వ్యవసాయం చేసుకుంటున్న సులేమాన్ గోరి పేరు మీద ఉన్న భూములను సర్వే చేయించారు. 46 మందికి పట్టాలు ఇప్పించారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే పట్టాలు అందజేస్తామని కలెక్టర్‌ చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో కొంచె ఆలస్యం అవుతున్నదని చెప్పారు అని తెలిపారు. రైతుబంధు 10 ఎకరాల లోపు ఉన్న వారికే ఇవ్వాలి. కౌలు రైతులను కూడా గుర్తించాలి.

- ఫొటోలో ఎడమవైపు రెండో వ్యక్తి వైఎస్‌ఆర్టీపీ మాజీ అధ్యక్షుడు పల్లెబోయిన తిరుపతి

''వైఎస్‌ఆర్టీపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. వైఎస్సార్‌ మీద అభిమానం ఉన్న ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. వైఎస్‌ఆర్టీపీ ఇక్కడ ఓటు శాతం కూడా బాగానే ఉంది. కానీ దానిని వైఎస్‌ షర్మిల ఉపయోగించుకోలేకపోయారు. మమ్మల్ని రాజకీయాల్లో మంచి స్థానాల్లో నిలబెడతానని చెప్పి షర్మిల మోసం చేశారు. కార్యకర్తలకు భరోసా కూడా ఇవ్వలేదు. నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణ గెలుస్తాడని ప్రజలు అనుకుంటున్నారు. ఆయన ఒక వేళ గెలిచిన రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడితే.. ఆ పార్టీలోకి గండ్ర సత్యనారాయణ వెళ్లే అవకాశాలు ఎక్కువ'' అని ఉమ్మడి రేగండ మండల వైఎస్‌ఆర్టీపీ మాజీ అధ్యక్షుడు పల్లెబోయిన తిరుపతి అన్నారు.

''నేను కాంగ్రెస్‌కే ఓటేస్తా.. ప్రభుత్వం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుబంధు ఎవరికి కావాలి. మాకు కావాల్సింది పంటకు కనీస మద్దతు ధర. మాకు కేసీఆర్‌ వద్దు. భూములు ఉన్నోళ్లకి రైతు బంధు.. మరీ భూమి కౌలుకు తీసుకుని చేసే వారికి ఎలాంటి బంధు లేదు కదా. ఇటీవల కేటీఆర్‌ కౌలురైతులకు రైతుబంధు విషయమై ప్రభుత్వం ఏర్పడ్డాక ఆలోచన చేస్తామన్నారు. ఇన్ని రోజులుగా రాని ఆలోచన ఇప్పుడే ఎందుకు వచ్చింది. ఓట్ల కోసమేనా?. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కేసీఆర్‌ వాటి పేరు మార్చి తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పిన మేనిఫెస్టోలో కూడా రెండు పార్టీలు హామీలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. మాకు రుణమాఫీ కూడా కాలేదు.. కేసీఆర్‌కు మేం ఓటేందుకు వేయాలి. మా హామీలను నెరవేర్చే వారికే మేం ఓటు వేస్తాం. గండ్ర సత్యనారాయణ ఇప్పటికే రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయనవైపు సానుభూతి పవనాలు వీస్తున్నాయి'' అని మహిళా రైతు రజిత చెప్పారు.

''నేను డిగ్రీ చేస్తున్నా.. మాకు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ అందించడం లేదు. నేను కాంగ్రెస్‌ ఓటు వేస్తా. గండ్ర సత్యనారాయణకు ఒక్కసారి ఛాన్స్‌ ఇవ్వాలనుకుంటున్నా. గండ్ర వెంకటరమణారెడ్డి ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచారు. కానీ ఆయన ప్రజాప్రతినిధిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోలేకపోయారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. దళితులకే అన్ని రకాల రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ యువతకు ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు రావడం లేదు. పరీక్షల మూల్యాంకనం కూడా సరిగా జరగడం లేదు'' అని తొలిసారి ఓటు వేయబోతున్నా విద్యార్థిని ప్రవర్ష చెప్పారు.

''మా దగ్గర 100 శాతం బీజేపీ గెలుస్తుంది. నరేంద్రమోదీ నాయకత్వంలో ఈటల రాజేందర్‌ పక్కా సీఎం అవుతారు. భూపాలపల్లి నుంచి కీర్తిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తారు. మా దగ్గర కమలం దళం కదిలింది. ఇక్కడ బీజేపీ గెలవడం ఖాయం. బీజేపీ ప్రచారం కూడా ఉవ్వెత్తున కొనసాగుతోంది. మొన్న జరిగిన ఈటల రాజేందర్‌ సభకు కూడా 80 వేల మంది దాకా వచ్చారు. ఇక్కడ బీసీ బిడ్డలు, ముదిరాజ్‌ బిడ్డలందరూ ఏకమయ్యారు'' అని బీజేపీ కార్యకర్త దొంతుల నరేష్‌ అన్నారు.

- మొట్లపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా కోనోకార్పస్ చెట్లు

మరోవైపు పచ్చదనం నాటిన కోనో కార్పస్ చెట్ల వల్ల చాలా నష్టాలున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. వాటి నుంచి వచ్చే వాసనను పీల్చుకోవడం వల్లే చాలా నష్టాలు ఉన్నాయని తెలిసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణ రావుకు సొంత ఇమేజ్

పార్టీల‌తో సంబంధంలేకుండా గండ్ర సత్యనారాయణరావుకు భూపాల‌ప‌ల్లి నియోజకవర్గంలో సొంత ఇమేజ్ ఉందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అన్ని మండ‌లాల్లో ఆయ‌న‌కు పార్టీల‌కు అతీతంగా వంద‌లాదిగా అభిమానులు, అనుచ‌రులు ఉన్నారని, ఇదే గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను గెలుపు అంచుల‌దాకా తీసుకెళ్లిందని అంటున్నారు. టీడీపీ నేతగా కొనసాగినప్పటి నుంచి కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నారని, నాయకులు, కార్యకర్తలు కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని చెబుతున్నారు. రెండు ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో ప్ర‌జ‌ల్లో ఉన్న సానుభూతితోపాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జోష్ గండ్ర విజ‌యానికి దోహ‌దం చేయ‌నుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో విస్తృత ప్ర‌జాద‌ర‌ణ ల‌భిస్తుండ‌టం, భారీ చేరిక‌లు కొన‌సాగుతుండ‌టంతో గండ్ర స‌త్య‌నారాయ‌ణ రావు గెలుపు సాధ్య‌మ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

Next Story