Telangana Polls: ఎవరీ ఎలక్షన్ కింగ్ పద్మరాజన్.. కేసీఆర్‌పైనే ఎందుకు పోటీ
తమిళనాడుకు చెందిన కె పద్మరాజన్ నవంబర్ 30న తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
By అంజి Published on 6 Nov 2023 12:30 PM ISTTelangana Polls: ఎవరీ ఎలక్షన్ కింగ్ పద్మరాజన్.. కేసీఆర్‌పైనే ఎందుకు పోటీ
దేశంలో తాను పోటీ చేసిన వివిధ ఎన్నికల్లో 236 సార్లు పరాజయం పాలైన తమిళనాడుకు చెందిన కె పద్మరాజన్ నవంబర్ 30న తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 'ఎలక్షన్ కింగ్'గా ప్రసిద్ధి చెందిన పద్మరాజన్.. తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో స్థానిక సంస్థల నుండి రాష్ట్రపతి ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో నామినేషన్ వేశారు. ఇది తన 237వ నామినేషన్ అని పద్మరాజన్ అన్నారు. ఎన్నికల్లో ఎంత సాధారణ వ్యక్తయినా పోటీచేయొచ్చు అని నిరూపించడానికే తాను ఎన్నికల బరిలో ఉంటున్నానని తెలిపారు.
1988 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని మెట్టూరు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసే మారథాన్‌ను ప్రారంభించానని, అప్పటి నుంచి మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావుపై కూడా పోటీ చేశానని టైర్ల మరమ్మతు దుకాణం నిర్వహిస్తున్న పద్మరాజన్ చెప్పారు. పద్మరాజన్ స్వస్థలం సేలం జిల్లా. పద్మరాజన్ ఇప్పటి వరకు ఐదు సార్లు భారత రాష్ట్రపతి ఎన్నికల్లో, ఐదు సార్లు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే 32 లోక్ సభ, 50 రాజ్య సభ ,75 అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పలు ఎన్నికల్లో పోటీచేశారు. తనను తాను హోమియోపతి డాక్టర్‌గా పిలుచుకునే పద్మరాజన్.. ఎన్నికల్లో పోటీ చేయాలనే మక్కువతో ఎన్నో రికార్డులు సృష్టించానని, తన అభిరుచి కోసం ఇప్పటి వరకు సుమారు రూ.కోటి రూపాయలకుపైనే ఖర్చు చేశాడు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నుంచి ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై పోటీ చేశారు. "2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2011లో మెట్టూరు నియోజకవర్గంలో నేను పోల్ చేసిన అత్యధిక ఓట్లు 6273" అని ఆయన చెప్పారు. కొన్ని పంచాయతీ ఎన్నికలలో సున్నా ఓట్లను సాధించారు. నవంబర్ 4న గజ్వేలులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. అతను లేదా అతని కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయలేదు. తాను 8వ తరగతి వరకు చదివానని, అన్నామలై ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ (చరిత్ర) చదువుతున్నానని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిగా, పద్మరాజన్ పేరు మోశారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుతో పాటు పలు రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నారు.