తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అన్ని రకాల రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ సీఈఓ ఆదేశాలు జారీ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించే అన్ని రాజకీయ ప్రకటనలకు అనుమతులను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ 11, శనివారం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) అన్ని ఛానెల్‌లు, సోషల్ మీడియా ఛానెల్‌లకు లేఖలు రాశారు. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి స్టేట్ లెవల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని సీఈవో లేఖల్లో ఆరోపించారు.
ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని పట్టించుకోకుండా.. "ఇష్టానుసారం ప్రసారం చేయడం" ద్వారా నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున వాటిని రద్దు చేస్తున్నట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం పేర్కొంది. తక్షణమే ప్రకటనల ప్రసారాలను నిలిపివేయాలని చానళ్లను ఆదేశించింది. ఈ ప్రకటనలకు సంబంధించిన కొన్ని వీడియోలు, క్లిప్‌లను కూడా సీఈఓ కార్యాలయం జత చేసిందని ఒక పత్రికా ప్రకటన తెలిపింది. లీడర్లు ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తూ తమకు కావాల్సినట్లు ప్రకటనలు తయారుచేసి ప్రచారం చేసుకుంటున్నారని ఈసీ అధికారులు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.