తొలిసారి ఓటు వేయబోతున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. ఈ ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకోవడానికి ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

By అంజి  Published on  29 Nov 2023 3:51 AM GMT
Telangana Polls, vote, assembly elections, first time voters

తొలిసారి ఓటు వేయబోతున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. ఈ ఓటు హక్కును పౌరుడు పారదర్శకంగా వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి దాదాపు 17 లక్షల మంది కొత్తగా ఓటు వేయబోతున్నారు. వీరిలో 18 - 19 ఏళ్ల వారు 8.11 లక్షల మంది ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్‌ సెంటర్‌ దగ్గర ఓటరు లిస్టులో ఓటరు తన పేరును కలిగి ఉండాలి. ఒక వేళ పేరు లేకపోతే ఓటు వేసేందుకు అనర్హుడు అని అర్థం. అందుకే ముందు తన ఓటు ఏ పోలింగ్‌ సెంటర్‌లో ఉందో చూసుకోవాలి. దీనికి బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు ఇచ్చే ఓటర్ స్లిప్‌ వెనుక క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేస్తే పోలింగ్‌ సెంటర్‌ తెలుస్తుంది. ఓటు హక్కు వినియోగించుకునే వారు తప్పనిసరిగా మోడల్‌ ఆఫ్‌ కండక్ట్‌ని పాటించాల్సి ఉంటుంది.

పోలింగ్‌ సెంటర్‌ దగ్గర అభ్యర్థుల గుర్తులు, కండువాలు, వస్త్రాలు ఎలాంటివి కూడా ధరించొద్దు. పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అధికారులు అనుమతించరు. అక్రమంగా తీసుకెళ్లి సెల్ఫీ తీసే ప్రయత్నం చేస్తే అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ఓటును లెక్కించరు. పోలింగ్‌ కేంద్రంలో కెమెరాలతో ఫొటోలు తీయకూడదు. ల్యాప్‌టాప్‌ను కూడా అనుమతించరు. సాధారణ ఓటరుగా పోలింగ్‌ సెంటర్‌కు వెళ్లాలి. భద్రతా సిబ్బందికి సహకరించాల్సి ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఓటర్‌ స్లిప్‌ ఒక్కటే ప్రామాణికం కాదు. ఎన్నికల సంఘం రూల్స్‌ ప్రకారం 16 ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకెళ్తేనే ఓటేసేందుకు ఛాన్స్ కల్పిస్తారు. ఆధార్‌, కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే కార్డ్, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్‌ కార్డు, పెన్షన్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే జాబ్‌ కార్డులు, యూడీఐడీ కార్డు, ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు ఇచ్చే కార్డులు, ఆర్జీఐ స్మార్ట్‌ కార్డు చూపించి ఓటు వేయవచ్చు.

ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవటం మొదలైనప్పటి నుంచి ఓటు పడుతుందా అనే సందేహం ఓటర్లకు కలుగుతోంది. అందుకే ఈసీ ఈ సమస్యకు వీవీ ప్యాట్‌ మిషిన్‌ ద్వారా పరిష్కారం చూపింది. ఓటరు తన ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత ఏ గుర్తుపై ఓటేశారో 7 సెకన్ల పాటు వీవీ ప్యాట్‌ మిషన్‌ తెరపై ఆ గుర్తు కనిపిస్తుంది. ఇలా తమ ఓటు పడిందని నిర్ధారించుకోవచ్చు. ఓటేసిన గుర్తు.. తెరపై కనిపించే గుర్తు సరిపోలితేనే ఓటు పారదర్శకంగా పడినట్లు.. లేకపోతే ప్రిసైడింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ అధికారి, అదనపు ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు ఇతర పోలింగ్‌ అధికారులు విధులు నిర్వర్తిస్తారు.

ఓటర్లు వీరికి సహకరించి ఓటు హక్కు వినియోగించుకోవాలి. మొదట ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వ్యక్తి పేరు సంబంధిత పోలింగ్‌ కేంద్రం ఓటరు జాబితాలో ఉంటే ఓటరు గుర్తింపు, క్రమ సంఖ్య, పేరును అదనపు ప్రిసైడింగ్ అధికారి గట్టిగా చదివి వినిపిస్తారు. అభ్యర్థుల ఏజెంట్లు సరేనని ఒప్పుకొంటే ఒకసారి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలును చెక్‌ చేస్తారు. అనంతరం ఓటరుకు సిరా వేయటం, రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయటం, ఓటరు స్లిప్‌ రాయటం చేస్తారు. వీటి తర్వాత ఓటరు.. పోల్‌ చీటీ తీసుకుని కంట్రోల్‌ యూనిట్‌లో బటన్‌ నొక్కి ఓటేసే అవకాశం కల్పిస్తారు.

Next Story