Telangana Polling: పలు చోట్ల ఘర్షణలు
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే పలు చోట్ల ఘర్షణ చోటు చేసుకుంది.
By అంజి Published on 30 Nov 2023 10:00 AM ISTTelangana Polling: పలు చోట్ల ఘర్షణలు
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే పలు చోట్ల ఘర్షణ చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఇబ్రహీంపట్నం పరిధిలోని ఖానాపూర్, మహేశ్వరం పరిధిలోని నాదర్‌గుల్‌లోనూ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. రంగారెడ్డి జిల్లాలోని ఒక పోలింగ్ బూత్ వద్ద రెండు పార్టీల కార్యకర్తలు హోరా హోరీగా గొడవకు దిగారు.
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న మున్సిపాలిటీ ఖానాపూర్ 105 పి ఎస్ నెంబర్ బయట ఇ కాంగ్రేస్ , బిఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒకవైపు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంటే మరోవైపు రెండు పార్టీ వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో రెండు వర్గాల కార్యకర్తలు అక్కడి నుండి పారిపోయారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
విజయమేరి పోలింగ్ కేంద్రం దగ్గర వాగ్వాదంతో మొదలైన గొడవ ఘర్షణకు దారి తీసింది. వెంటనే స్పందించిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. కూకట్ పల్లి కైతలాపూర్ వద్ద ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చెలరేగడంతో పోలీసుల రాకతో ప్రశాంత వాతావరణం నెలకొంది.
మరోవైపు తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా కీలక నేతల గెలుపు, మెజారిటీలపై పందేల హోరు కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీకి చెందిన బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగి కొత్త పేర్లతో యాప్స్ సృష్టించాయి. రూ.లక్షకు లక్ష మరికొందరు బుకీలు 1:10 చొప్పున ఆఫర్స్ ఇస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల మేర బెట్టింగ్ జరుగుతున్నట్టు అంచనా. ఇటు ఏపీలోనూ ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే.. బెల్లంపల్లి బీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లోకి కండువా వేసుకుని వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు. అంతకుముందు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇదే తరహా ఉల్లంఘనకు పాల్పడ్డారు. దీనిపై అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.